మక్తల్, మార్చి 15 : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం మక్తల్‌లోని జాతీయ రహదారి 167పై కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి నేడు వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేసినందుకు ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. నిండు సభలో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలను అణచాలని చూస్తే ప్రజలు క్షమించరని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆశిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, శంకర్, సుధాకర్‌రెడ్డి, మహెమూద్, మన్నాన్, నరసింహారెడ్డి, సుదర్శన్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి, అమ్రేశ్, ఉమాశంకర్ గౌడ్, ఆనంద్, అస్గర్‌అలీ, ఆనంద్, బాలప్ప, సాధిక్, రఘు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.