మక్తల్, మార్చి 15: సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 167వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో చేశారు. సీఎం ఏ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మక్తల్ యువజన విభాగం అధ్యక్షుడు గవినోల నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ కుమార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ విధించడం ఎంతవరకు సమంజసమన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ గొంతు నొక్కడానికి అధికార పక్షం ప్రయత్నిస్తున్నదని గవినోల నరసింహారెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్సిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జుట్ల శంకర్, సుధాకర్ రెడ్డి, దర్శన్ గౌడ్, మనన్, ఉమా శంకర్ గౌడ్, రఘు, అమ్రేష్, ఆనంద్, గుర్రపల్లి అశోక్, ఆంజనేయులు, రాజు తదితరులు పాల్గొన్నారు