తిమ్మాజీపేట : తిమ్మాజిపేట మండలం గొరిట నుంచి బాజీపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులను ( Road Works) వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, స్వామి, మురళీధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సైఫుద్దీన్, బాలయ్య, నరసింహులు, రాఘవచారి, వెంకటేష్ తదితరులు గురువారం రోడ్డు పనులను పరిశీలించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రూ. 5.04 కోట్లను మంజూరు చేశారని పేర్కొన్నారు. వీటితో మెటల్ పని కల్వర్టుల నిర్మాణం చేపట్టారని, అయితే ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ను సంప్రదిస్తే బిల్లులు రాలేదని అందుకే రోడ్డు పనులను నిలిపివేసినట్లు చెప్పారని తెలిపారు. పనులు నిలిచిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రదీప్ తెలిపారు.
వర్షాలు పడుతుండడంతో రోడ్డు మొత్తం చిత్తడిగా తయారైందని, రోడ్డుపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోయారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని పనులు పూర్తి చేయించాలని కోరారు. అనంతరం వారు ఎదరపల్లి తండా రోడ్డును పరిశీలించారు. తండాలో మంచినీటి సమస్యపరిష్కరించాలని డిమాండ్ చేశారు.