తిమ్మాజిపేట : మండల కేంద్రంలో మంచినీటి సమస్యను తీర్చాలని బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) ఆందోళన నిర్వహించి గ్రామపంచాయతీ వద్ద బైటాయించారు. గ్రామంలోని 3,4 వార్డుల్లో అనేక రోజులుగా మంచినీరు ( Drinking Water ) రావడంలేదని, పలుసార్లు గ్రామపంచాయతీ అధికారులకు సమస్యను విన్నవించినా ఫలితం లేదన్నారు.
కొన్ని వార్డుల్లో నిరంతరాయంగా నీటి సరఫరా జరిగి వృథాగా నీరు పోతుండగా గ్రామానికి వస్తున్న మిషన్ భగీరథ ( Mission Babhirath) నీళ్లు పరిశుభ్రంగా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న సంపును సిబ్బంది శుభ్రం చేయడం లేదని ఆరోపించారు.
ప్రస్తుతం వర్షాలతో నీరు కలుషితమై రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన పైప్లైన్ గుమ్మకొండ వద్ద లీకేజీ అవుతుందని, అక్కడే కొందరు బహిర్భూమికి వెళ్తున్నారన్నారు. గ్రామంలో చెత్త సేకరణ సరిగా చేయడం లేదని ఆరోపించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు రజాక్, నాయకులు స్వామి, వెంకటేష్, సైఫుద్దీన్, సలావుద్దీన్, కాళ్ల రాజు, ప్రశాంత్, నాగయ్య పాల్గొన్నారు.