నవాబ్‌పేట, అక్టోబర్ 15 : ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మండలానికో కేంద్రాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మూడ్రోజుల కిందట ఆదేశించడంతో లింగంపల్లిలో అధికారులు, మహిళా సంఘం సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కేంద్రాన్ని ప్రారంభించేందుకు మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిరబోయి మంగళవారం మధ్యాహ్నం లింగంపల్లికి చేరుకున్నారు. అంతలోనే ఫోన్ కాల్ రాగా.. స్థానిక ఎమ్మెల్యే, నాయకులకు తెలియకుండా కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని అడగడంతో అప్పటికప్పుడు నిలిపివేసినట్లు సమాచారం. దీంతో కలెక్టర్ మహిళలతో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మహిళలు నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచి కేంద్రం ప్రారంభం కోసం నిరీక్షిస్తే.. కలెక్టర్ వచ్చి ప్రారంభించకుండా వెళ్లిపోవడమేమిటని చర్చించుకున్నారు. కాగా, ఈ విషయంపై ఏపీఎం జీవరత్నంను వివరణ కోరగా.. ఎమ్మెల్యేతో మాట్లాడి మరోసారి డేట్ ఫిక్స్ చేసి ప్రారంభిస్తామని చెప్పారు.