అయిజ: కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం.. బ్రహ్మాండ నాయకుడి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయిజ పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామి (వేంకటేశ్వర స్వామి) బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను పట్టణంలో ఊరేగించనున్నారు. ప్రతి రోజు శ్రీవారు ప్రత్యేక వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి స్వామిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ తెలిపింది.