Amarachinta | అమరచింత, ఏప్రిల్ 2 : ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదలు సన్న బియ్యం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఒకటవ తేదీ నుంచి సన్నబియ్యం అందజేసేందుకు మార్చి 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హుజురాబాద్లో సన్న బియ్యం అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అమరచింత, ఆత్మకూరు మండలాల్లో మాత్రం రెండో తేదీ వచ్చినా.. రేషన్ షాపులు తెరవకపోవడంపై రేషన్ బియ్యం మీదే ఆధారపడి జీవితాలను గడుపుతున్న వారు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా మండల కేంద్రాల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభం చేసిన తర్వాతే రేషన్ డీలర్లు బియ్యం సరఫరా చేయాలని ఎమ్మార్వోలు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలు బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎమ్మార్వోల ఆదేశాలపై ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నత అధికారులు స్పందించి పేదలకు సన్న బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు.