శ్రీశైలం, ఫిబ్రవరి 11: శ్రీశైల మహాక్షేత్రంలోని అన్నదాన భవనంలో బాయిలర్ పేలి ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం అన్నదాన భవనంలోని వంటశాలలో అన్నం వండివార్చే క్రమంలో అధిక ఉష్టోగ్రతతో ఒత్తిడికి గురైన బాయిలర్ ఒక్కసారిగా పేలిందన్నారు. దీంతో ఎగిసిన వేడి నీటి ఆవిరి భవనం పరిసరాల్లో పనుల్లో నిమగ్నమైన కూలీలపై పడడంతో బాలుడితో సహా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు శబ్దానికి మిగతా పనివారు, భోజ నం చేసేందుకు వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. తేరుకున్న అధికారులు, సిబ్బంది గాయపడ్డవారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పేలుడు విషయం తెలుసుకున్న ఈవో లవన్న, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి హుటా హుటిన అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులను కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తల్లిదండ్రుల వద్దకు వచ్చి…
బ్రహ్మోత్సవాల సందర్భంగా కూలీకి వచ్చిన వారి పిల్లలు భోజన సమయం కావడంతో తల్లి దండ్రుల వద్దకు వచ్చారు. ఇదే సమయంలో పేలుడు సంభవించడంతో 7 సంవత్స రాల బాలుడు గాయపడ్డాడు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు లేదా హైదరాబాద్కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే…
సంబంధిత విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్లే బాయిలర్ పేలుడు సంభవించిందని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెండు నెలల కిందట కూడా బాయిలర్ పేలిందని అప్పుడు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అప్పుడు బాయిలర్కు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. కాగా అన్నదానం కోసం లక్షల రూపాయలు విరాళాలిస్తున్నా వంటశాలలో పాత యంత్రాల మార్చడం లేదని, వాటి స్థానంలో ఆధునిక యంత్రాలు వినియోగిస్తే ఇలాటి ప్రమాదాలు సంభవించవని భక్తులు అంటున్నారు.