పెంట్లవెల్లి, సెప్టెంబర్19 : తెలంగాణ సరిహద్దున ప్రవహిస్తున్న కృష్ణానది తీరంలో ఆంధ్రా ప్రాంతాలకు చెందిన మరబోటు ప్రయాణం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం కృష్ణానది ఉప్పొంగి ఉరకలు వేస్తున్నది. ఈదురు గాలులతో అలలు ఎగిసిపడుతుండడంతో నది అవతలి ఒడ్డున రాయలసీమ ప్రాంతాల్లో ఆంధ్రా పోలీసులు కృష్ణానదిలో రాకపోకలను నిషేధించారు. దీంతో తెలంగాణలోని బోటు యాజమానులు రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలు నిలిపారు.
కానీ ఆంధ్రాప్రాంతానికి చెం దిన బోటు యాజమానులు ఆంధ్ర పోలీసులతో చేతులు కలిపి కృష్ణానదిలో తమ ఇష్టానుసారంగా మరబోటులో ప్రయాణికులను చేరవేస్తూ ఒక్కో ప్రయాణికుడితో రూ.100, బైక్కు సైతం రూ.100 చొప్పున వసులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలైన కొండపాటూరు, కొరిదేల, ముచ్చమర్రి, మోర్రకొండ, పగిడాల, బొల్లారం, బ్రాహ్మణకొటుకూరు, బార్కాపురం, పాతకోట తదితర గ్రామాలకు ప్రయాణికులను చేరవేసి అందినకాడికి దోచుకుంటున్నారు.
తెలంగాణ ప్రాంతంలోని పెంట్లవెల్లి మండలం, మంచాలకట్ట గ్రామం కృష్ణానది తీరం ఒడ్డున పోలీస్, రెవ్వెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మరబోటులో పరిమితికి మించి ప్రయాణికులను బస్తాలు పేర్చినట్లు పెర్చడమే కాక, అందులో బైక్లను సైతం ఎక్కించుకొని ఉధృతం గా ప్రవహిస్తున్న కృష్ణానదిలో ప్రమాదకర అలల మధ్య.. ప్రయాణికులకు లైవ్ జాకెట్లు సైతం ఇవ్వకుండా వారి రక్షణను గాలికి వదిలేసి ప్రాణాలతో చేలగాటం ఆడుతూ తమ బోటు వ్యా పారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
19 ఏండ్ల కిందట సింగోటం లక్ష్మీనరసింహాస్వామి రథోత్సవానికి రా యలసీమ ప్రాంతం నుంచి ఇవతలి ఒడ్డుకు మరబోటులో ప్రయాణికులను చేరవేస్తూ.. మంచాలకట్ట గ్రామ సమీపంలో ప్రమాదవశాతు బోటు ము నిగి 61 మంది మృత్యువాత పడిన ఘటన ఇరు రాష్ర్టాల ప్రజలు మరచిపోలేదు. అలాంటి ఘటన పునరావృతం కాక ముందే అధికారులు స్పందించి ఉధృత్తంగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో రక్షణ లేకుండా మరబోటులో ప్రయాణికులను చేరవేస్తు న్న రాయలసీమ బోటు యాజమానులపై చర్యలు తీసుకొని, మరబోట్ల రాకపోకలను నిషేధించాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.