నారాయణపేట, జూలై 15 : మూతి మీద మీసా లు రాని వయస్సు… బండి బరువులో సగం బరువు ఉండే బకపలచని శరీరం.. బండిపై కూర్చుంటే భూమికి కాళ్లు అందని ఎత్తు.. అయినా సరే బండి నడపాలనే మోజు పైగా తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పకపోవడంతో రయ్యి… రయ్యి మంటూ నారాయణపేట నగర రోడ్లపై చిన్న పిల్లలు వాహనాలను నడిపిస్తున్నారు. అంతే కాకుండా వాహనాలకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను కాదని అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించి పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ మరీ వాహనాలను పరిగెత్తిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా సైలెన్సర్లను బిగించడం నేరమే అయినప్పటికీ వాటిని ఖాతారు చేయడం లేదు.
ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను నడిపిస్తున్న చిన్నారులు మధ్య మధ్యలో పటాకులు పేలిన శబ్దా న్ని చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రుల్లో అయితే ఇక వీరి పోటా పోటీ రైడింగులను చెప్పవలసిన అవసరం లేదు. రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఫట్… ఫట్… మనే సైలెన్సర్ శబ్దాలతో జనం నిద్రకు భంగం కల్పిస్తున్నారు. కొంత మంది చిన్నారులు అయితే ఏకంగా ద్విచక్ర వాహనాలను వేసుకొని పాఠశాలు, కళాశాలలకు వెళ్తున్నారు. పాఠశాలల, కళాశాలల అధ్యాపకులు చూస్తే తిడతారనే భయంతో వారు తెచ్చే వాహనాలను పాఠశాలలు, కళాశాలలకు దూరంగా నిలిపి వెళ్తున్నారు.
వాహనాలకు కంపెనీ నుంచి వచ్చే సైలెన్సర్లను కాదని అధిక శబ్దం చేసే సైలెన్సర్లను బిగించడానికి వీలు లేకున్నా ద్విచక్ర మెకానిక్‌లు డబ్బులకు ఆశపడి సైలెన్సర్లను బిగిస్తున్నారు. చిన్నారులకు వాహనాలు ఇవ్వడమే తల్లిదండ్రుల పెద్ద తప్పు పైగా ఇలాంటి చేష్టలకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం ఎంతవరకు సరైందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బండిని ఎలా కంట్రోల్ చేయాలో మెచ్యూర్ కానీ మెంటాలిటీ వయస్సు చిన్నారులకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి కానీ, వారి వల్ల ఇతరులకు ప్రమాదాలు వాటితే బాధ్యులు తల్లిదండ్రులే అన్న విషయాన్ని
గుర్తు పెట్టుకొని చిన్నారులకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో కంపెనీ నుంచి వచ్చే వాహనాలకు ఉండే సైలెన్సర్లను కాదని అధిక శబ్దం చేసే సైలెన్సర్లను బిగించకూడదనే విషయంపై ద్విచక్ర మెకానిక్‌లకు పోలీసులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే సమయంలో మైనర్లు ద్విచక్ర వాహనాలను నడిప రాదనే విషయంపై పాఠశాలలు, కళాశాలల్లో సైతం అవగాహన కల్పించాల్సిన బాధ్యత అటు పోలీసులైనా ఇటు పాఠశాలల, కళాశాలల యజమానులపై ఉన్నది.
మోటరు వాహనాల చట్టం ప్రకారం మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే, వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. మైనర్లకు వాహనం ఇచ్చిన యజమాని కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే 1988 మోటరు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం బాల నేరస్థులకు జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. వాహనం నడిపిన మైనర్‌కు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మైనర్‌కు వాహనం ఇచ్చిన యజమానికి రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు, వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. అలాగే వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేయాడమే కాకుండా బాల నేరస్థుడికి 25 ఏండ్లు వచ్చే వరకు లెర్నర్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత కూడా ఉండదు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది, కాబట్టి పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది.