అలంపూర్ చౌరస్తా, మార్చి 07: రాయచూర్ ప్రధాన రహదారిపై దారి దోపిడికి పాల్పడిన ముఠాను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. అలంపూర్ ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 2న మానపాడు మండలం కొర్విపాడు గ్రామ నివాసి ఫిలేమాన్ అనే వ్యక్తి అల్లంపూర్ చౌరస్తా నుంచి మోటారు సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో సబ్‌స్టేషన్ సమీపంలో కాలకృత్యాల కోసం రోడ్డు పక్కన మోటారు సైకిల్ నిలిపి పక్కకు వెళుతున్నాడు.
ఆయన వెనకే స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సెల్‌ఫోన్, మోటారు సైకిల్, రూ.2,500 నగదును దోచుకువెళ్లారు. ఈ విషయమై బాధితుడు ఫిలేమాన్ ఈనెల 5న ఉండవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ మహేష్, తమ సిబ్బందితో కలిసి రెండు రోజుల్లోనే నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులలో నాగర్ కర్నూల్ వాసులు జనార్దన్ రెడ్డి, గంగాధర్, ఏపీలోని కర్నూల్ వాసులు తిరుపతి సురేష్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద రూ.2,500 నగదు, మోటారు సైకిల్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ముగ్గురు నిందితులను అలంపూర్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించామని సీఐ రవిబాబు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు నాగేష్, హుస్సేన్, రవీంద్రలను సీఐ రవిబాబు అభినందించారు. త్వరలోనే వీరికి రివార్డులు అందజేస్తామని తెలిపారు.