పాలమూరు, మే 22: తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్ పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో సోమవారం భాగ్యరెడ్డి వర్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, ప్రొఫెసర్ గిరిజామంగతయారు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ జాతీయస్థాయి ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ బిడ్డ అని అభివర్ణించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన దేశవ్యాప్త కార్యాచరణకన్నా ముందే తెలంగాణ, ఆంధ్రలో నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన దార్శనికుడని పేర్కొన్నారు. అతడి పేరు మాదిరి భాగయ్య. పేరుకు రెడ్డి అనే పదం రేడు నుంచి వచ్చిందని, దానికి అర్థం పాలకుడని తెలిపారు. అదేవిధంగా దేశానికి ఆర్యులు రాకముందే ఇక్కడున్న మూలవాసులే దేశ పాలకులని, రెడ్డి అనే పదాన్ని వాడమని ఒక శివగురువు సలహా ప్రకారం తనపేరులో రెడ్డి అని చేర్చారని తెలిపారు. హిందూ మత సంస్కరణ కోసం ఆయన చేసిన కృషికి ఆర్యసమాజం వర్మ అనే బిరుదును అందించారని తెలిపారు. కార్యక్రమంలో పీయూ ఓఎస్డీ డా.మధుసూదన్‌రెడ్డి, అకాడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ నూర్జహాన్, ఎమ్మార్వో వెంకట్సెల్, సూపరింటెండెంట్ రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భాగ్యరెడ్డివర్మకు ఘననివాళి
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డివర్మ జయంతిని గండీడ్ మండలకేంద్రంలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కప్లాపూర్ మాజీ ఎంపీటీసీ ఆశన్న, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, చెన్నప్ప, సంజయ్, వెంకటయ్య, చంద్రయ్య, మొగులయ్య, మల్కయ్య, కోట్యానాయక్, కేశవులు, చెన్నయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.