మహబూబ్నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 2 : ఓ వైపు ఆహార భద్రత కార్డులు జారీ కాక వేలాది కుటుంబాలు ఎదురు చూస్తుండగా.. మరో వైపు ఇప్పటికే కార్డులు ఉండి పుట్టిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదని ఆవేదన చెందుతున్నవారు ఉన్నారు. నమోదు కోసం మండల, రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రజా పాలన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో 39,435 కార్డులు తొలగించడంతో పాలమూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తకార్డులు జారీ చేస్తున్నాం.. సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నామని చెబుతూనే.. ఉన్న కార్డుల్లో కోత కొస్తుండటం కొసమెరుపు.
కార్డుల్లో కోత ఇలా..
మహబూబ్నగర్ జిల్లాలో గత నెల (మార్చి)లో మొత్తం కార్డులు 2,53,229 ఉండగా ఈ నెల (ఏప్రిల్)లో మొత్తం కార్డుల సంఖ్య 2,44,578కు చేరింది. ఈ లెక్కన 8,651 కార్డులు తొలగించారు. జోగుళాంబ-గద్వాల జిల్లాలో మార్చిలో 1,73,183 కార్డులు ఉండగా ఈ నెలలో కోటా కేటాయించిన కార్డులు 1,63,693 అంటే 9490 కార్డులకు కోత పెట్టారు.
నాగర్కర్నూల్ జిల్లాలో మార్చిలో 2,52,765 కార్డులు ఉండగా ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య 2,43,107. ఈ లెక్కన 9,658 కార్డులు తొలగించారు. నారాయణపేట జిల్లాలో మార్చి నెల కోటా కింద 1,52,323 కార్డులకు బియ్యం కేటాయించగా ఏప్రిల్కు గానూ 1,44,472 కార్డులకే కేటాయింపు ఇచ్చారంటే 7851 కార్డులు తొలగించారు. వనపర్తి జిల్లాలో మార్చిలో 1,63,138 కార్డులు ఉండగా ఈ నెల కోటా కింద 1,59,353 మాత్రమే కేటాయించారు. ఇలా మొత్తం ఉమ్మడి పాలమూరులోని 5జి ల్లాల్లో మొత్తం కార్డులు 39,435 తొలగించారు.
లక్షల్లో దరఖాస్తులు పెండింగ్..
గతేడాది నవంబర్లో నిర్వహించిన కుల గణనలో, ఈ ఏడాది జనవరిలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కొత్తగా కార్డులు జారీ చేయాల్సిన ప్రభుత్వం ఉన్నకార్డులు తొలగిస్తుండటం దారుణమని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికే అనేక మంది తమ కుటుంబ సభ్యుల పేర్లు కార్డుల్లో చేర్చాలంటూ.. కొత్త కార్డులు జారీ చే యాలంటూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నట్లు ప్రకటించినా.. ఓ వైపు కోతలతో వాతలు పెడుతుండడంతో ఎటూపాలుపోలేని దుస్థితిలో పేదలు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తేనే పొట్టనిండేది..
ఉమ్మడి పాలమూరులో సన్నబియ్యం పంపిణీ ప్రహాసనంగా మారింది. ఇప్పటికే రెండు రోజులు గడుస్తున్నా.. చౌకధర దుకాణాలు పూర్తిస్థాయిలో తెరవకపోవడంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బింధువు అయిన మహబూబ్నగర్ జిల్లాలోనే మొదటి రోజు పూర్తిస్థాయిలో సన్నబియ్యం పంపిణీ జరగలేదంటే అతిశయోక్తి కాదు. చాలా వరకు ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తేనే.. డీలర్లు ప్రజా పంపిణీ చేపడుతున్నారు. మహబూబ్నగర్ నగర పాలక సంస్థ పరిధిలో మొదటి రోజు అనేక దుకాణాలు తెరుచుకోలేదు. ఇదేమని కార్డుదారులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ప్రారంభించాక.. పంపిణీ చేపడతామని పలువురు డీలర్లు సమాధానం ఇచ్చారు.
సన్నబియ్యం మొదటి రోజు 14శాతమే..
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చౌకధర దుకాణాల్లో మొదటి రోజు కేవలం 14శాతం మాత్రమే లావాదేవీలు జరిగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2037 చౌకధర దుకాణాలు ఉండగా.. బుధవారం సాయంత్రం 4గంటల వరకు కేవలం 285 దుకాణాల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ చేపట్టారు. ఆయా దుకాణాల్లో మాత్రమే లావాదేవీలు జరిగాయి. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాలు ఉండగా కేవలం 187 దుకాణాల్లో మాత్రమే లావాదేవీలు జరిగాయి.
దొడ్డుబియ్యం బ్యాక్లాగ్ స్టాక్ ఎవరి బాధ్యత..
గత నెల వరకు రేషన్ దుకాణాలకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో కొంత బ్యాక్లాగ్ స్టాక్ మిగిలింది. ఈ నెల నుంచి సన్నబియ్యం ఇవ్వనుండటంతో ప్రతిషాప్కు ఫుల్ అలైన్మెంట్ ఇచ్చారు. బ్యాక్లాగ్ ఉన్న దొడ్డుబియ్యాన్ని తీసుకెళ్లలేదు. ఈ బియ్యానికి మీదే బాధ్యత అంటూ డీలర్లపైనే ఆ భారం పెట్టేశారు. కొత్త బియ్యం స్టాక్ దించినప్పుడు పాత బియ్యాన్ని తిరిగి తీసుకెళ్లాల్సి ఉండగా.. చాలా చోట్ల ఆ బియ్యాన్ని తిరిగి తీసుకెళ్లలేదు. చాలా వరకు షాపులను అద్దెకు తీసుకుని నడిపిస్తున్నామని, పాతస్టాక్కు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు.
వందశాతం పంపిణీ చేస్తున్నాం..
జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వందశాతం దుకాణాల్లో పంపిణీ చేపడుతున్నాం. దొడ్డు బియ్యం బ్యాక్లాగ్ డీలర్లకు భద్రపర్చమని చెప్పాం. త్వరలో వాటిని క్లియర్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. ముందు సన్నబియ్యం కార్డుదారులకు అందించాలని సూచించాం.
– వెంకటేశ్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి, మహబూబ్నగర్