నాగర్కర్నూల్, సెప్టెంబర్ 27 : ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు (240 మంది మహిళలు) శుక్రవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో నిర్మించిన 240 ఇండ్ల కో సం లబ్ధిదారులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఏడాది కావస్తున్నా నేటికీ ఇం డ్లను కేటాయించకపోవడంలో అంతర్యమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్, వాటర్ పైపులైన్ వంటి చిన్న చిన్న పనులు కాలేదని సాకుగా చూపుతున్నారన్నారు. పలు రకాల కారణాలతో చూపి పేదలకు ఇండ్ల కేటాయింపులను ఆపేస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ఇండ్లను కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయన్నారు.
ఇటీవల కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం సభలో ఫ్లకార్డులతో సమస్యలు వివరించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులను ఎన్ని సార్లు అడిగినా లాభం లేదన్నారు. గతంలో ఆందోళన చేస్తే.. దసరా వరకు కేటాయిస్తామన్నారని.. గడువులోగా ఇవ్వకపోతే తామే పనులు చేయించుకొని ఇండ్లను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న మహిళలకు సీపీఎం నాయకురాలు కందికొండ గీత మద్దతు తెలిపారు.