బీచుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆగ్రహం గద్వాల/ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్ 24 : ‘మా ప్రిన్సిపాల్‌పై చర్య లు తీసుకోండి.. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుండు.. విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తూ వే ధింపులకు పాల్పడుతుండు.. అతడి నుంచి తమకు రక్షణ కల్పించండి.. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు’.. అని ఆగ్రహంతో బీచుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ బాధలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం పాఠశాల నుంచి గద్వాల కలెక్టరేట్ వరకు 19 కిలోమీటర్లు 100 మందికిపైగా విద్యార్థులు పాదయాత్రగా చేరుకున్నారు.
కలెక్టర్‌ను కలవడానికి పెద్ద ఎత్తున రావడంతో గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు గేటు బయటే బైఠాయించారు. విషయం అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో హాల్లో కూర్చోబెట్టండి మాట్లాడుతా.. అని చెప్పి గంటకుపైగా కూర్చోబెట్టారు. కలెక్టర్‌కు తమ బాధలు చెప్పుకుందామని వస్తే ఆలస్యం చేయడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. చివరకు పది మంది విద్యార్థులను కలెక్టర్ తన చాంబర్లోకి పిలిచారు. దీంతో వారి బాధలను వెల్లగక్కారు.
బీచుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్ గతంలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సమయంలో రెండుసార్లు సస్పెండ్ అయ్యారని, అలాంటి వ్యక్తికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే తమను దూషిస్తున్నాడని, ఆకారణంగా విద్యార్థులపై చేయి చేసుకుంటున్నాడని ఆరోపించారు. అధ్యాపకులు బాగా బోధన చేస్తుంటే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోయారని తెలిపారు.
అలా ఖాళీగా ఉన్న సీట్లను ప్రిన్సిపాల్ ఇతరులకు అమ్ముకుంటున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడంతోపాటు టార్చర్ పెడుతున్నారని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి మెస్ చార్జీల పెంపు మాటలకే పరిమితమైందని, పాత మెనూ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మెనూ బాగాలేక చాలా మంది బయటకు వెళ్లి భోజనం చేస్తున్నారని తెలిపారు. గురుకులంలో మౌలిక వసతులు కూడా కరువయ్యాయని, ఒకటి, రెండుకు బయటకు పోవాల్సిందేనని వాపోయారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి ఆందోళన చేస్తామన్నారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. చివరకు జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థులతో మాట్లాడి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో బీచుపల్లి గురుకుల పాఠశాలకు తరలించారు.
విద్యార్థులు కష్టపడి చదివి ప్రతిభ నిరూపించుకొని రెసిడెన్షియల్లో సీటు సంపాదిస్తే చిన్నచిన్న కారణాలకు వారిని వేధిస్తున్నారు. దీంతో వారికి టీసీలు ఇచ్చి పంపిస్తున్నారు. వారి స్థానంలో ఇతర విద్యార్థులకు సీట్లు అమ్ముకుంటున్నారు. నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా ఎక్కడ ఖర్చు చేశారో తెలియడం లేదు. డార్మెంటరీలు లేవు. 5వ తరగతి పిల్లలు బాత్రూంకు రాత్రి పూట గుట్టపైకి వెళ్తున్నారు. విషసర్పాలు కాటేస్తే ఎవరిది బాధ్యత. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. చేసేది లేక పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది. ప్రిన్సిపాల్ విద్యార్థులతోపాటు అధ్యాపకులను వేధిస్తున్నాడు. దీంతో అక్టోబర్ నుంచి ఫిజిక్స్ లెక్చరర్ వెళ్లిపోయాడు.
– కేశవరెడ్డి, ఇంటర్ విద్యార్థి
ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని చెబుతున్నా వాస్తవ పరిస్థితి మా గురుకులంలో కనిపించడం లేదు. పాత మెనూనే అమలు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక విద్యార్థులు టీసీలు తీసుకెళ్లారు. అధ్యాపకులు చదువు చెప్పలేక వెళ్లిపోతున్నారు. స్టడీ అవర్స్‌లో వాష్‌రూంకు వెళ్లినా బూతులు తిడుతున్నారు. గురుకులంలో వసతులు కరువయ్యాయి. అయినా పట్టించుకునే నాథుడే లేడు. నీళ్లు తాగేందుకు వెళ్లినా తిట్లు తప్పవు.. పేరెంట్స్ వస్తే కలవనీయడం లేదు. సీనియర్ విద్యార్థులకు ఇప్పటి వరకు ప్రాక్టికల్స్ చేయించలేదు. ప్రిన్సిపాల్ తీరుతోనే గతేడాది 10/10 ఎవరు సాధించలేదు. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు..
– భరత్‌సింహా, ఇంటర్ విద్యార్థి
విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న బీచుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు. రాష్ట్రంలో బీచుపల్లి గురుకుల పాఠశాలకు గుర్తింపు ఉండేది.. కానీ ప్రిన్సిపాల్ కారణంగా చెడ్డ పేరు వచ్చిందన్నారు. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.