మహబూబ్నగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ బీసీలను పథకం ప్రకారం కుట్ర ప్రారంభించింది.. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎదగనియ్యకుండా.. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తూ తీవ్ర అన్యాయానికి గురి చేస్తోంది. తాజాగా ప్రకటించిన కుల గణన లెక్కలు కూడా ప్రభుత్వ కుట్రను బహిర్గతం చేస్తున్నాయి. హడావిడిగా అర్ధరాత్రి విడుదల చేసిన కులగణన లెక్కల్లో బీసీల వాటాలు తక్కువ చేసి చూపించడం.. బీసీల్లో అత్యధికలు ముస్లింలే ఉన్నారని చూపించడం చూస్తుంటే బీసీల్లో చీలిక తీసుకురావడానికి పెద్ద ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన లెక్కలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీసీ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గత రెండున్నర ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించకుండా.. రాజకీయ సామాజిక కోణాల్లో రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి అమలు చేయకుండా చేస్తూ తాజాగా ప్రకటించిన లెక్కల్లో అసలు బీసీల ఉనికికే ప్రమాదకరంగా మారిందని మండిపడుతున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఈ సర్వే లెక్కలు ఉన్నాయని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కామారెడ్డి డిక్లరేషన్ల లో రాజకీయంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఈ మేరకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా మూడు లక్షల కోట్ల 30గా అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను దివాలా తీస్తుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సంపదలు దోచి ఢిల్లీకి మూటలు పంపు తున్నారని ఇందుకు కులగణన లెక్కలే సాక్ష్యంగా నిలుస్తాయని బీసీ సంఘాలు అంటున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వేలో నీ లెక్కలు ప్రస్తుతం కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని మండిపడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీసీల జనాభా దాదాపు 60 శాతానికి మించి ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో 80శాతం వరకు బీసీలే ఉన్నారు. అయినా ఆయా నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం నడుస్తోంది. అయితే బీసీలకు టికెట్లు కేటాయిం చడంలో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో ఒక్క మక్తల్ నియోజకవర్గం తప్పా మిగతా నియోజకవర్గాల్లో రెడ్డిలే ప్రజాప్రతినిధులు అయ్యారు. 12 నియోజకవర్గాల్లో రెండు ఎస్సీలకు పోను ఒక నియోజకవర్గంలో బీసీ పోను మిగతా అన్నింటిలోనూ అగ్రవర్ణాలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు బీసీలకు రెండే రెండు. ఒకటి ఓటమి చెందగా మరొక బీసీకి మంత్రి పదవి ఇచ్చారు. చాలా చోట్ల బీసీలు టికెట్లు అడిగిన కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది.
రేవంత్ సర్కార్ హడావిడిగా ప్రకటించిన కుల గణన లెక్కలు బీసీల జనాభాను తగ్గించి చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీసీల్లోని మెజారిటీగా ఉన్న ముదిరాజులు, కురుమలు, గౌడ కులస్తులు ఇతర కులాలకు తక్కువ చేసి చూపిస్తున్నారు. బీసీలో ఉన్న కులాలన్నింటినీ కూడా తక్కువ శాతమే ఉందని ప్రకటించి.. చేతులు దులుపుకుంటున్నది ప్రభుత్వం.. ఇప్పటికైనా ప్రకటించిన కులగణన లెక్కలు తప్పని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కల్లో పథకం ప్రకారం బీసీ జనాభాను తక్కువ చేసి చూపించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర్గాల్లో బీసీల ప్రాతినిధ్యమే ఎక్కువ. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణాలలో బీసీల అందరూ మాయమ య్యారా..? బీసీల్లోని ప్రధాన కులాలను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది రేవంత్ సర్కార్ కుట్రే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ జనాభా లెక్కలను వెంటనే ఉపసంహరించుకోవాలి. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రాజకీయ ప్రాధాన్యం కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం.
– గంజి వెంకన్న, ముడా మాజీ చైర్మన్ మహబూబ్నగర్
రేవంత్ సర్కార్ ప్రకటించిన కులగణనలో బీసీల లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీలందరూ తమ కులాలను చెప్పకుండా దాచి పెట్టారా అనే అనుమానం వ్యక్తం అయ్యేలా ఈ నివేదికలు ఉన్నాయి. అధికారంలోకి వస్తే బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ చెప్పిన మాటలు ఆచరణలో వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు చూస్తుంటే బీసీలను అణగతొక్కేందుకు పెద్ద కుట్ర నడుస్తుందని అర్థం అవుతుంది. ఈ లెక్కలన్నింటినీ వివరించి బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు తమ తడాఖా చూపించాల్సి వస్తుంది.
– ఎం.శ్రీనివాస్, బీసీ సమాజ్ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు