మల్దకల్, జూలై 11 : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడొచ్చినా కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసుహనుమంతు నాయుడు అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బాసుహనుమంతు నాయుడు, బాసు శ్యామల హాజరయ్యారు. అంతకుముందు బస్టాండ్ నుంచి గ్రామంలోకి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మండల కేం ద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంత బజారలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ తరుఫున గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నానని చెబుతున్నాడని, సంవత్సర కాలంగా ఏం అభివృద్ధి చేపట్టాలో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న పథకాలే తప్పా కొత్త పథకాలు లేవన్నారు. వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని, మహిళకు రూ.2,500 జీవన భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పనితీ రు ప్రజలకు అర్థమైందని, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.
ఎంపీపీ స్థానంతోపాటు జెడ్పీటీసీ, 25 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు. అనంతరం నేతువానిపల్లి నుంచి జనార్ధన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే విఠలాపురంలో మాజీ ఉప సర్పంచ్ మోశ ఆధ్వర్యంలో, మంగంపేట నుంచి రామకృష్ణ ఆధ్వర్యంలో, ఎల్కూర్ నుంచి బీసన్న ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో పలువురు నాయకులు చేరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాసుశ్యామల, రాఘవేంద్రారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రాజారెడ్డి, చక్రధర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మోనేశ్, తిరుమల్ నాయు డు, రాజు, భరత సింహారెడ్డి, వీరేశ్‌గౌడ్, రాజు నాయుడు, పుణ్యమూర్తి, కామేశ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.