నాగర్ కర్నూల్ : డాక్టర్ బాబూ జగ్జీవన్రాం (Babu Jagjivan Ram) నిస్వార్థ సేవకు, న్యాయ పోరాటానికి ప్రతీక అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ (Collector Santosh ) అన్నారు . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్రాం అని అన్నారు .
పట్టణంలోని పాత కలెక్టర్ కార్యాలయం వద్ద బాబు జగ్జీవన్రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy) , జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ( SP Vaibhav) తదితరులు పాల్గొని జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లో ( Indian Politics) ఎంతో ప్రభావ వంతమైన నాయకుడు మాత్రమే కాకుండా, నిస్వార్థ సేవకు, న్యాయ పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. సామాజిక శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి, నిస్వార్థంగా కొనసాగించిన ఉద్యమాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్రాం జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలిచాయని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆయన, న్యాయం , సమానత్వానికి నిలువెత్తు ప్రాతినిధ్యంగా నిలిచారని తెలిపారు.
జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడని, ప్రజా ప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయనను ఆదర్శంగా యువత ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి పి. వి. శ్రావణ్ కుమార్, షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్ , ఎ ఎస్ డబ్ల్యూ వో శ్రీకర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు వెంకేశ్వరం నిరంజన్, జెట్టి ధర్మరాజు, విజయ్, మాజీ కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.