ఉమ్మడి మహబూబ్నగర్: స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహఙంచారు. జగ్జీవన్ రామ్ జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో 40 ఏండ్లపాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్మించి బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్రమైన కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు శంకర్, దుర్గం శ్రీనివాసులు, రాజప్ప, కొండన్ గోపాల్, దశరథ్, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
మమహబూబ్నగర్ జిల్లా ధన్వాడలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని దళిత సంఘాలు, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సొంత బజార్ వద్దనున్న బాపూజీ విగ్రహానికి అఖిలపక్ష నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు జగజీవన్ రామ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు రామచంద్రయ్య, గోవర్ధన్ గౌడ్, మల్లయ్య, దళిత సంఘాల నాయకులు వెంకటయ్య, రాజు నర్సింలు, హుసేనయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్లో జన్మించారని, దేశంలోనే అణగారిన కులాల కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. అణగారిన కులాల గొంతుకులను బయటకు తీసుకురావడానికి భారతీయపు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన మహాయోధుడు అని, సామాజిక సంఘసంస్కర్తగా దేశానికి జగ్జీవన్ రామ్ సేవలు చాలా కీలకమని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో సభ్యుడిగా, వివిధ ఉన్నత పదవులు అధిరోహించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని, ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భారత దేశంలో తొలి ఉప ప్రధానమంత్రిగా పేరు ప్రఖ్యాతలుగాంచారన్నారు.
మరికల్ మండల కేంద్రంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జోగు రామస్వామి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుప నరసింహులు మాట్లాడుతూ బడుగు వర్గాల ఆశాజ్యోతి, బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. అనంతరం స్థానిక సంతా బజారులో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరికల్ మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, మాజీ ఉపసర్పంచ్ సీమ శివకుమార్, నాయకులు సీమ మాసన్న, బాలరాజ్, కురుమయ్య, కొండేటి రాజు, ఆంజనేయులు, ప్రశాంత్, వెంకటేష్, రమేష్,కొండన్న, లక్ష్మీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు