మక్తల్ : దేశ ప్రజల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో.. కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తిరుపతికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేసి ఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆయన చెప్పారు.
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో ఆందోళనలు చేస్తున్నామని గోవిందరాజు తెలిపారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం పెన్షన్ సామాజిక భద్రత ప్రయోజనాలను ఆశా కార్యకర్తలకు కల్పించాలన్నారు. కరోనా కట్టడిలో ఆశా కార్యకర్తలు తగిన రక్షణలు లేకున్నా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు పునర్జీవనాన్ని అందించారని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా కార్యకర్తలను గ్లోబల్ లీడర్లుగా గుర్తించిందని చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో దేశవ్యాప్తంగా 10 లక్షల తొమ్మిది వేల మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం జాతీయ ఆరోగ్య మిషన్‌ను శాశ్వత ఆరోగ్య కార్యక్రమ పథకంగా మార్చాలని డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పరిస్థితులను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భాషా కార్యకర్తలకు వేతనంతో కూడుకున్న ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్ లీవులు, వైద్య సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం ఆశాలకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ సభ్యులు యశోద, ఇందిర, అమీనా బేగం, అనిత, సుజాత, అనురాధ, సావిత్రమ్మ, రాజేశ్వరి, కళావతి, పుష్ప, రవీంద్రనమ్మ తదితరులు ఉన్నారు.