గద్వాల టౌన్, జూన్ 4 : చూడగానే ముద్దొచ్చే రూపం.. ఎర్రని తివాచీ సున్నితత్వం.. ముట్టుకుంటే మాసిపోతాయేమోననిపించే అందం.. దానికి తోడు ఆపన్నహస్తాన్ని అందించడంలో వీటికి సాటేదీ లేదనడం లో అతిశయోక్తి లేదు.. అవేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవేనండీ.. మన రైతునేస్తాలైన ఆరుద్ర పురుగులు.. వానలు ప్రారంభం కావడంతో ఈ పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో రైతు ల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కాలం కలిసొచ్చినట్లేనని, పంటలు బాగా పండుతాయని సంబురపడిపోతున్నారు.
కీటక జాతికి చెందిన ఆరుద్ర పురుగులను ‘మినుగులు’, ‘ఆరుద్ర పువ్వులు’ అని పిలుస్తారు. కీటకాలను చూస్తేనే ఆమడదూరం పారిపోయేవారు సై తం వీటిని పట్టుకోకమానరు. తొ లకరి వర్షాల అనంతరం 15 రోజులకు వచ్చే కార్తె ఆరుద్ర కార్తె.. కానీ ఈ కార్తె రాకముందే ఆరుద్ర పురుగులు రైతులను మురిపింపజేస్తున్నాయి. వీటికి, రైతులకు అవినాభావ సంబం ధం ఉంది. మినుగు లు విరివిగా కనిపిస్తే ఆ ఏడాదంతా స మృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయన్న నమ్మకం అన్నదాతల్లో ఉన్నది. అందుకే నాటి నుంచి నేటి వరకు ఆరుద్ర పువ్వుల ఆగమనాన్ని రైతులు శుభపరిణామంగా భావిస్తారు.
అందానికే కాదు.. ఆపన్న హస్తాన్ని అందించడంలో తనకు సాటి మరెవరూ లేరని ఆరుద్ర మురిసిపోతుంది. తొలకరి దుక్కుల్లో పంటనాశన కీటకాలను ఈ మినుగులు నాశనం చేస్తాయి. పంటను నాశనం చేసే కీటకాలతోపాటు వాటి గుడ్లను సైతం ఇవి తినేయడంతో మొక్కలు బలంగా ఎదిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. అన్నదాతకు తెలియకుండానే ఆయన కష్టాలను పాలుపంచుకుంటూ పంటను కాపాడుతుంది.
ఆరుద్ర పువ్వులను ఆయుర్వేదిక్ మందుల తయారీలో నూ ఉపయోగిస్తారు. పురుగుల ద్వారా తీసే నూనెను హె ర్బల్ మెడిసిన్, వివిధ ఔషధాల్లోనూ వినియోగిస్తారు. పాన్‌మసాలా తయారీలోనూ ఈ నూనెను వాడతారు.
మనిషి స్వార్థం కోసం విచ్చలవిడిగా ఎరువులు, రసాయనాలను వాడుతూ పుడమి తల్లిని కాలుష్యం చేస్తున్నా రు. దీంతో రైతులకు ఎంతో మేలు చేసే కీటక జాతి అంతరించి పోతున్నది. అందులో ఒకటి ఆరుద్ర పురుగు. కొన్ని ప్రాంతాల్లో ఈ పురుగులకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వాటిని సేకరించి విక్రయించిన ఘటనలూ ఉన్నాయి. ఈ పురుగులను 2017, 18 సంవత్సరాల్లో ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేశారన్న వార్తలొచ్చాయి. రైతులకు లాభసాటి పం టలను అందించడంలో తోడుండే ఆరుద్ర పురుగులను కా పాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.