అచ్చంపేటరూరల్ : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ( BJP ) నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రం చేసిందని సీఐటీయూ ( CITU ) జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్, జిల్లా నాయకులు బి రాములు ఆరోపించారు.ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా అచ్చంపేటలోని సివిల్ సప్లై గోదాం సిబ్బందికి సమ్మె నోటీసును( Strike Notice ) అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన కార్మిక ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లిందని , కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తుందని బీజేపీపై మండిపడ్డారు. 12 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేస్తున్నారని, సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తున్నదని ఆరోపించారు.
కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కఠిన తరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా బరితెగించిందని విమర్శించారు. సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సివిల్ సప్లై గోదాం హమాలీలుచంద్రయ్య, జంగయ్య బక్కయ్య ,రేనయ్య, రాము, కార్మికులు పాల్గొన్నారు.