పాలమూరు, మే 12 : విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని పీయూ రిజిస్ట్రార్ గిరిజ మంగతాయారు, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం, క్రీడల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం లక్ష్యాన్ని నిర్దేశించుకొని నాలుగేండ్లలో ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలని తెలిపారు. కష్టపడి చదివితే ఐఏఎస్ ర్యాంకు సాధించడం కష్టమేమీ కాదని తెలిపారు. హీర సింగిల్ వికలాంగురాలైనా డెయిరీ మిల్క్‌లో పని చేసి ఎంబీఏ చదివి 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిందని, అలాగే కడప జిల్లాలోని మౌర్యరెడ్డి, వరంగల్ శ్రీజ కష్టపడి ఆల్ ఇండియా ఐఏఎస్ 28వ ర్యాంకు సాధించినట్లు గుర్తుచేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు.