Maddimadugu | అచ్చంపేట, నవంబర్ 1 : నల్లమలలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. భక్తులు మద్దిమడుగు ఆంజనేయస్వామిని పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. 1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో 12మందితో మొదటిసారి మాలధారణ ప్రారంభమైంది.
అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాలధారణ స్వాముల సంఖ్య భారీగా పెరిగింది. జయరాంస్వామి వారి శిష్యులు గురుస్వాములైన వారు గ్రామాలు, పట్టణాల్లో మాలలు వేయడం జరుగుతున్నది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, హైదరాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల పరిధిలో స్వాములు పెద్ద ఎత్తున మాలధారణ చేపట్టనున్నారు. అందులో భాగంగా ఈనెల 2న (శనివారం) అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం క్షేత్రంలో జయరాం గురుస్వామి మాలధారణ ప్రారంభించనున్నారు.
3,4న హనుమాన్ దీక్షపీఠం లక్ష్మీనగర్ సాగర్‌రోడ్డు హైదరాబాద్‌తోపాటు అచ్చంపేట, దేవరకొండ, నల్లగొండ, సూర్యపేట, మాచర్ల, గుత్తికొండ, కారంపుడి, గుంటూరు ప్రాంతాల్లో మాలధారణ జరుగనుంది. ఈనెల 21నుంచి 25 వరకు అర్ధ మండల దీక్ష స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 14న సీతారామస్వామి కల్యాణం, హనుమాన్ పడిపూజ, 15న మార్గశిర పౌర్ణమి సందర్భంగా మద్దిమడుగులో హనుమత్ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి, మాలవిరమణ నిర్వహించనున్నారు. మాలధారణ సందర్భంగా నల్లమలలోని మద్దిమడుగు క్షేత్రం లక్షల సంఖ్యలో తరలిరానున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు, ఆలయ కమి టీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మద్దిమడుగు ఆంజనేయస్వామి పిలిస్తే పిలికే దైవం. 1992లో స్వామివారు స్వప్నంలో చెప్పినప్పుడు 12 మందితో మాలధారణ ప్రారంభించాను. నేడు రెండు రాష్ర్టాల్లో లక్షలమంది మాలధారణ స్వీకరిస్తున్నారు. 41రోజులు మండల దీక్ష పూర్తి చేసుకొని మద్దిమడుగు క్షేత్రానికి కుటుంబ సమేతంగా ఇరుముడితో స్వామివారి సన్నిధికి భారీగా తరలివస్తున్నారు. అక్కడ భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి, స్నానాలు గదులు పెంచాలి. మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేయాలి.
తలనీలాల కౌంటర్లు పెంచి, రాత్రివేళ కూడా తెరిచి ఉంచేలా చూడాలి. భక్తుల కోసం 5రోజులు అన్నదానం కొనసాగించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా తాత్కాలికంగా స్నానపు గదులు ఏర్పాటు చేయాలి. కోటమైసమ్మ ఆలయంలో హలాల్ నిషేధం బోర్డు ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో ఐదు రోజుల పాటు టోల్గేట్ రుసుము లేకుండా చూడాలి. రాత్రివేళ నిద్రించేందుకు భక్తులకు ప్రాంగణంలో టెంట్లు వేయించాలి. పడిపూజ, గాయత్రి మహాయజ్ఞం ఇతర పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
-జయరాం గురుస్వామి, మాలధారణ వ్యవస్థాపకులు