గద్వాల, డిసెంబర్ 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం చాలా మందికి అమలు కాలేదు. అర్హ త ఉన్నా.. మాకేది అంటూ పలువురు కర్షకులు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండుగ కార్యక్రమంలో రైతులతో చప్పట్లు కొట్టించుకొని రుణమాఫీ చేశామని చెప్పడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 1.40 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు అధికారుల అంచనా. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేయగా రూ.2 లక్షల రుణాలు తీసుకున్న చాలా మందికి మాఫీ కాలేదు. అయితే కాని రైతుల వివరాలను సేకరించారు. రైతులు కూడా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 14 వేల మంది రైతు కుటుంబాలు తమకు మాఫీ వర్తించలేదని మళ్లా దరఖాస్తు చేశారు. వాస్తవంగా జిల్లాలో కేవలం 8,262 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో వచ్చింది. లిస్ట్‌లో తమ పేర్లు చెక్ చేసుకున్న రైతులు అర్హత ఉన్నా మాఫీ జాబితాలో పేర్లు లే కపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
అసెంబ్లీ ఎ న్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చిన కాం గ్రెస్ తర్వాత గద్దెనెక్కి రుణమాఫీ చేయకుండా మొం డిచేయి చూపిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రుణమాఫీ గాక.. అటు రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు మరోసారి పెట్టుబడుల కోసం ఆసాముల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎలాంటి షరతులు లేకుండా రూ2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు ఇప్పుడు కొర్రీలు పెట్టడం ఏమిటని అన్నదాతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే స ర్కారు తమ నడ్డి విరిచిందని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఎటువంటి షరతులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. ప్రస్తుతం రుణమాఫీ కాని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు..
గట్టులోని ఎస్బీఐ బ్యాంక్‌లో రూ.1,51,500 పంట రుణం తీసుకున్నాను. ప్రతి ఏడాది రెగ్యులర్‌గా రెన్యూవల్ చేస్తూ వచ్చాను. గ తేడాది ఆగస్టు 3వ తేదీనా రె న్యూవల్ చేశాను. నాకు రుణమాఫీ కాకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులకు దరఖా స్తు చేసుకున్నాను. అధికారులు మీ రుణమాఫీ ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. బ్యాం కుకు వెళ్లి అడిగితే జాబితాలో లేదన్నారు. నేను రెగ్యూలర్‌గా రెన్యూవల్ చేసినా రుణమాఫీ కాలే. రెన్యూవల్ చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రభు త్వం చేస్తున్న మాఫీ అంతా గందరగోళంగా ఉంది. అ ధికారంలోకి రావడానికి ప్రభుత్వం చెప్పిందొకటి.. ప్రస్తుతం చేస్తున్నది మరోటి..
– రాఘవేంద్రరావు , రైతు, గట్టు
కుటుంబంలో ఒక్కరికీ కాలే..
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో మా కుటుంబలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే. అయిజలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా పేరుపై రూ.1.60 లక్షలు, నా భర్త తిరుమల్‌రెడ్డి పేరుపై అదే బ్యాంకులో రూ.1.60 లక్షలు, నా కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి పేర రూ.60 వేల రుణం తీసుకున్నాం. ముగ్గురిది ఒకే ఫ్యామిలీ.. ఒకే రేషన్ కార్డు.. ఉన్నప్పటికీ ఎవరికీ రుణమాఫీ కాలేదు. దీంతో వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. మొన్న ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో ఎవరికైనా ఒకరికి మాఫీ అవుతుందనుకున్నాం.. కానీ ఎవరికీ కాలేదు. ఎన్నికల సమయంలో షరతులు లేకుండా ఇస్తామని.. ఇప్పుడేమో కొర్రీల పేరుతో మాఫీ చేయడం లేదు.
– రామలక్ష్మి, మహిళా రైతు, అయిజ
రూ.2లక్షలకుపైగా ఉన్నా మాఫీ లేదాయే..
మాకు 13 ఎకరాల పొలం ఉంది. ఎస్బీఐలో నా పేరుపై.. నా భార్య పేరుపై రూ.2.80 లక్షల రుణం తీసుకున్నాం. అయితే రూ.2 లక్షలకుపైగా ఉన్నా రూ.80 వేలు బ్యాంకులో చెల్లించా.. రెన్యూవల్ రెగ్యులర్‌గా వేస్తున్నాను. మాఫీ కాకపోవడంతో మళ్లా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తులు అందించాం. అయినా రుణమాఫీ కాలే. దీంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి కాని వారికి తిరిగి రుణమాఫీ చేసి ఆదుకోవాలి. అయినా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో మా పేర్లు లేవు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాట మార్చింది.
– వెంకట్రామిరెడ్డి, రైతు, జిల్లెడుదిన్నె