అచ్చంపేట రూరల్, సెప్టెంబర్ 17 : కంచె చేను మేసినా చందంగా బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగే ఖాతాదారుల అకౌంట్స్ నుంచి అనుమతి లేకుండా పొదుపు చేసిన డబ్బులను కాజేసినా ఘటన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎస్బీఐలో ఆలస్యంగా చోటుచేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. కష్టపడి సంపాదించిన డబ్బులు ఇండ్లలో దాచుకుందామంటే దొంగల భయం ఉంటుందని, బ్యాంకులో అయితే భద్రతతోపాటు భవిష్యత్‌లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బ్యాంక్‌లో దాచుకోగా తమ అనుమతి లేకుండా బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగి కిరణ్ 21మంది ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులను కాజేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కొంతమంది ఖాతాదారులు తాము బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకొనుటకు బ్యాంక్‌కు వచ్చి డబ్బులను డ్రా చేసేందుకు ప్రయత్నం చేయగా బ్యాంక్ అధికారులు వారి అకౌంట్లలో డబ్బులు లేవని తెలపడంతో బ్యాంక్ మేనేజర్ హుస్సేన్‌బాషాకు ఫిర్యాదు చేయడంతో ఆయన పూర్తిస్థాయిలో విచారణ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 2018 నుంచి బ్యాంక్ లో క్లర్క్‌గా పనిచేస్తున్న కిరణ్ అనే ఉద్యోగి ఒకరి బ్యాంక్ ఖాతాల్లోని మరొకరికి మళ్లించి అలా బ్యాంక్‌లో పొదుపు చేసిన 21మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.95 లక్షలు మాయం చేసినట్లు సంబంధిత అధికారులు నిర్ధారించారు.
చాలా ఏండ్ల నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్న కిరణ్ డబ్బులను ఖాళీ చేసినట్లు నిర్ధ్దారణ కావడంతో అతడిని విధుల నుంచి తప్పించడంతోపాటు సస్పెండ్ చేసి జైలుకు పంపినట్లు మేనేజర్ తెలిపారు. అయితే బాధితులకు ఇప్పటి వరకు సస్పెండైనా వ్యక్తినుంచి గాని, బ్యాంక్ నుంచి గాని పోయిన డబ్బులు రాకపోవడంతో మంగళవారం బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టి మేనేజర్‌ను నిలదీశారు. వారికి తోడుగా టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బొజ్జ అమరేందర్‌రెడ్డి మద్దతుగా నిలిచి అవసరాల కోసం బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే అమాయక ప్రజల అకౌంట్ల నుంచి అనుమతి లేకుండా డబ్బులను దోచుకోవడంతోపాటు ఏడాదైనా తిరిగి ఇవ్వకపోవడం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ నెల ఆఖరుగాలోగా బాధితులకు డబ్బు లు తిరిగి ఇవ్వకపోతే బ్యాంక్ ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. దీంతో మేనేజర్ మాట్లాడు తూ నెలలో బాధితులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు.