కొల్లాపూర్, జూలై 28 : నల్లమల అభయారణ్యం వన్యప్రాణులు, సకల జీవరాశులు, ఔషధా లు, సకల ఖనిజాలకు పుట్టినిల్లులాంటిది. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌కు ప్రపంచ అడవుల జా బితాలో ప్రత్యేక స్థానం ఉన్నది. నేడు ప్రపంచ పులుల ది నోత్సవం సందర్భంగా నల్లమల పులుల ఉనికిపై కథనం..
భారతదేశంలోని 55 టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఆరో స్థానంలో ఉన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోనూ అడవి విస్తరించింది. 36వేల హెక్టార్లలో ఉన్న నల్లమల అభయారణ్యంలో అనేక జీవరాశులు ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులుల గ్రేడింగ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. కోర్ ఏరియాలో ఇది రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇందులో పులు ల రక్షిత ఆవాస కేంద్రంగా పరిగణించబడింది.
మార్చి 2024 నాటికి దేశంలో 3,682 అడవి పులులు ఉన్నా యి. 2,611.4 చదరపు కిలోమీటర్లు విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులుల సంరక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అమ్రాబాద్ ఫారెస్ట్ పరిధిలో పర్యావరణ పరిరక్షణతోపాటు వన్యప్రాణులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1983లో అభయారణ్యంగా మారిన నల్లమల టెర్మినలియా టొమెంటోసా, హార్డ్వికియా బినాటా, మధుకాలాటిఫోలియా, డయోస్పైరోస్ మెలకోక్సిలాన్, గార్డెనియా మొక్కలు విస్తారంగా ఉన్నాయి.
పులి ఆహార అలవాటులో వేట ప్రధాన ప్రత్యేకత అని చెప్పొచ్చు. పులులు తన సంతానాన్ని పోషించుకునేందుకు తగినంత ఆహారం లభించే విశాలమైన ఆవాస ప్రాంతాలు అవసరమవుతాయి. పులులకు కావాల్సిన ఆహారంతోపాటు విశాలమైన ఆవాస ప్రదేశం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఉండడం మూలంగా ఇతర ఫారెస్టుల నుంచి కూడా పులులు వలసలు వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నల్లమల అభయారణ్యాన్ని రెండు పాయలుగా వెళ్లే కృష్ణానది మూలంగా జీవరాశులకు తాగునీటి కొరత కూడా లేదు. పులులు వేటాడేందుకు జింకలు, అడవి పందులు, దుప్పులు లాం టివి పుష్కలంగా ఉన్నాయి. మాంసాహార జంతువుల ఉత్పత్తి కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా గడ్డి మొక్కలను పెంచుతున్నారు. ఏటా గ్రాస్‌ను పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పులులకు నిలయంగా ఉన్నది. కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 10 పులుల దాకా ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో మాంసాహార జంతువుల ఉత్పత్తి కోసం గ్రాస్ పెంచేందుకు కృషి చేస్తున్నాం. అడవిలోకి అనుమతి లేకుండా వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ పులులు ఉత్పత్తికి తోడ్పాటందిస్తున్నాం. అడవిలో మనుషుల అలజడిని పూర్తిగా నివారించడంతోనే వాటి ఆవాసాల్లో జంతువుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనే పులుల సంరక్షణ కేంద్రాల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు ఉన్నత స్థానంలో ఉంది.
– శరత్‌చంద్రారెడ్డి, కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్