Achchampet | అమ్రాబాద్, ఫిబ్రవరి 16: అచ్చంపేట మండల విద్యాధికారి పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని ఆల్ ఇండియా నాగర్ కర్నూల్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జక్కా బాలకిష్టయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట మండలం విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా తన విధులు నిర్వహిస్తున్న అంబలి జీవన్ కుమార్ పై అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ విధులకు హాజరుకాని సమయపాలన పాటించని ఉపాధ్యాయులను మందలించడం తప్పు కాదని పేర్కొన్నారు. పై అధికారిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారని అది జీర్ణించుకోలేని ఉపాధ్యాయురాలు వేధింపులకు గురి చేస్తుండు అని అక్రమ కేసు పెట్టడం, దీనికి బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ వంటి మనువాద సంస్థలు వెనుక ఉండి నడిపించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత ఉద్యోగిగా స్థిరపడి అదే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పనిచేస్తున్న నిజాయితీ కలిగిన ప్రధానోపాధ్యాయుని పై కేసు పెట్టడం వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఉందని జక్కా బాలకిష్టయ్య అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు అని జక్కా బాలకిష్టయ్య పేర్కొన్నారు. ఇలాంటి విధానాలకు పాల్పడుతున్న పార్టీలు సంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల బాధ్యులు సామ అనిల్, మంతటి చంద్రశేఖర్, ఏనుపోతులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.