నారాయణపేట/మూసాపేట/ఊట్కూరు, నవంబర్ 4 ; బీఆర్ఎస్ సర్”కారు’ హామీ ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నది. అందుకు తగ్గట్లుగానే గత ఎన్నికల సమయంలో, జిల్లాలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా రూ.3,300 కోట్లతో కరివెన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా.. త్వరలోనే కృష్ణాజలాలతో నింపనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించారు. నారాయణపేటకు వచ్చిన సమయంలో జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించి.. అమలు చేయడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది. పీఆర్ఎల్లో భాగంగా కాల్వ పనులకు టెండర్లు పూర్తి కాగా.. త్వరలోనే జయమ్మ చెరువును కృష్ణాజలాలు చేరనున్నాయి.
గత పాలకుల నిర్లక్ష్యం, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన నడిగడ్డ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అద్వితీయంగా అభివృద్ధి చెందుతున్నది. పచ్చని పైర్లు, విద్య, వైద్యపరంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నది. కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైన తుమ్మిళ్ల లిఫ్ట్, గట్టు ఎత్తిపోతల పథకం, గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణాలకు రాష్ట్ర ఏర్పాటుతోనే బీజం పడింది. కేసీఆర్ మాట అంటే నడిగడ్డ ప్రజలకు నమ్మకం, హామీ ఇస్తే నెరవేర్చే వరకు శ్రమించే నాయకుడు, నడిగడ్డ వాసుల సాగునీటి గోసతోపాటు విద్య, వైద్య సమస్యలు తీర్చి వారికి అండగా నిలిచిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. 2002లో జోగుళాంబ గద్వాల జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో ఆర్డీఎస్ చివరి అయకట్టుకు నీరు అందించి అంలపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి నడిగడ్డకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రత్యేక కథనం.
మాట నిలబెట్టుకున్న సీఎం ..
ఉద్యమ సమయంలో 2002 జూలై 20న కేసీఆర్ గద్వాల జిల్లాలో చేపట్టిన పాదయాత్ర ఫలితంగానే నేడు తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. సుంకేసుల బ్యారేజీని సందర్శించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు ద్వారా తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే తెలంగాణ ప్రజలు 4టీఎంసీలకు మించి వాడుకోలేదు. ఈక్రమంలో రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మిళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని ఆయన అప్పుడే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ సీఎం అయ్యాక 2018 జనవరి 8న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.162కోట్లతో మొదటి విడత పనులు షురూ కాగా అధికారులు, కాంట్రాక్టర్ల సహకారంతో 8 నుంచి పదినెలల్లో పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రతి ఏటా తుంగభద్రానదిలో 3.69 టీఎంసీలు నీరు ఉన్నన్ని రోజులు ఎత్తిపోసుకునేలా చర్యలు తీసుకున్నారు. ‘తుమ్మిళ్ల’ ప్రారంభంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరు అందడంతో రైతులు సంతోషిస్తున్నారు.
పుట్టి ప్రయాణానికి చెక్..
గద్వాల మండలంలో దివిగ్రామంగా పిలిచేది గుర్రంగడ్డ. వర్షాకాలం వస్తే ఈ పల్లెకు ఇతర గ్రామాలతో సంబంధాలు నిలిచిపోతాయి. వారికి ఆపదొస్తే పుట్టి ప్రయాణమే దిక్కు. ఈ గ్రామాన్ని గతంలో తమకు ఓటేస్తే బ్రిడ్జి ఏర్పాట్లు చేస్తామని నమ్మించారే తప్పా.. అమలుకు నోచుకోలేదు. కాగా 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ గద్వాలకు వచ్చిన సమయంలో గుర్రంగడ్డకు బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 2018లో గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగా, గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలువడంతో గుర్రంగడ్డ వాసుల కల నెరవేరింది. సీఎం ఇచ్చిన హామీ మేరకు అదే ఏడాది డిసెంబర్ 27న బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేయగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే ఆ ఊరి ప్రజల ఎన్నో ఏండ్ల కల నెరవేరినట్లే.
గట్టు ఎత్తిపోతలతో ‘గద్వాల’ సస్యశ్యామలం..
గట్టు ఎత్తిపోతలను గత పాలకులు ఎన్నికల నినాదంగా ఉపయోగించుకున్నారే తప్పా ప్రాజెక్టు నిర్మించి నీటిగోస తీర్చలేదు. తమను గెలిపిస్తే ఎత్తిపోతలను పూర్తి చేసి నియోజకవర్గ చివరి భూములకు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పిన మేరకు పనులు ప్రారంభించగా వేగంగా కొనసాగుతున్నాయి.
రూ.వంద కోట్లతో అభివృద్ధి పనులు..
సీఎం కేసీఆర్ గద్వాలకు వచ్చిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయగా, జిల్లా కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పార్కులను అభివృద్ధి చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఇండోర్ ఆడిటోరియం, జూరాల ప్రాజెక్టు వద్ద బృందావన్ గార్డెన్, సంగాల పార్కు వద్ద మినీట్యాంక్ బండ్ ఏర్పాటు, పీజీ కళాశాలకు నూతన బిల్డింగ్, వసతి గృహ నిర్మాణం, మున్సిపాలిటీలో బీటీరోడ్ల నిర్మాణం, నూతన ఆర్టీసీ బస్టాండ్, ఆర్వోబీ, నూతన నర్సింగ్ కళాశాల నిర్మాణం, సెంట్రల్‌లైటింగ్, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టారు.
మెడికల్ కళాశాల మంజూరు..
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.13.50కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా 100 పడకలు ఉన్న ఏరియా దవాఖానను జిల్లా దవాఖానగా మార్చి 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయగా, పనులు చివరి దశలో ఉన్నాయి.
అలంపూర్ నియోజకవర్గంలో..
తుంగభద్ర పుష్కరాలకు వచ్చిన సమయంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారు. 100 పడకల దవాఖాన ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయగా, ప్రస్తుతం ప్రారంభిచుకున్నాం. అలంపూర్ చౌరస్తాలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు సహకరించారు. ఇలా ‘నడిగడ్డ’కు కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో జిల్లావాసులకు నమ్మకం ఏర్పడింది.