Venkatapuram | అయిజ రూరల్: వెంకటాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని కిష్టాపురం, వెంకటాపురం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం అఖిలపక్ష కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంతోష్‌కు వినతి పత్రం సమర్పించారు. మండలం ఏర్పాటుకు కావాల్సిన అన్ని వసతులు , సదుపాయాలు తమ గ్రామానికి ఉన్నాయని అఖిల పక్ష నేతలు తెలిపారు. ప్రధానంగా రోడ్లు, రవాణా సౌకర్యం అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్‌కు విన్నవించారు.
వెంకటాపురం కేంద్రంగా మండలం ప్రకటిస్తే సమీప గ్రామాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కలెక్టర్‌కు అఖిల పక్ష నేతలు తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్నందున గ్రామం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తానని కలెక్టర్ చెప్పారని గ్రామస్తులు తెలిపారు.