మహబూబ్‌నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడుత పల్లెపోరుకు సర్వం సిద్ధంచేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో శనివారం ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉద యం 7 నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు ముగిసియడంతో రెండో దశ పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 519సర్పంచ్ స్థానాలకు 4223 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు 1,656 మంది పోటీ పడుతుండగా వార్డులకు 9,333 మనది బరిలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల్లో ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి విడుత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో రెండో విడుత ఎన్నికలను కూడా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ విజయేంద్ర బోయి, నాగర్‌కర్నూల్ జిల్లాలో కలెక్టర్ బదావత్ సంతోష్, జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఎం సంతోష్, నారాయణపేట జిల్లాలో సిక్తా పట్నాయక్ , వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆదర్శ్ సురభి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
సర్వత్రా ఉత్కంఠ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడుత ఎన్నికల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుతో కేంద్రాలకు బ్యాలె ట్ బాక్స్‌లతో పాటు సామగ్రిని తరలించారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ స్లిప్పులను పంచాయతీల వారీగా పంపిణీ చేశారు. కాగా రెండో విడుత ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సవాల్‌గా మారాయి. మరోవైపు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరుస్తుందో మరికొద్ది గంటల్లో భవితవ్యం తేలనున్నది.
వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన
ఆయా జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఒకవేళ గొడవలు జరిగితే వెంటనే అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో ఫోర్స్‌ను ఏర్పాటు చేశా రు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌కు పరీక్షగా ..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తమ మద్దతుదారులను గెలిపించుకున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పాలమూరు జిల్లా గులాబీకి జైకొట్టింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. రెండు, మూడో విడుతల్లో జరుగుతున్న ఎన్నికలను కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ఇలాకాల్లో గుబులు బయలుదేరింది. రెండో విడుత ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఆశాజనకంగా రాకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నట్లు భావించవచ్చు. కొంతమంది అభ్యర్థులు సొంతంగా ఎన్నికల బరిలో నిలబడి తమ సత్తా చాటుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే రెండో విడుత పంచాయతీల్లో కారు జోరు కొనసాగించనుందా, హస్తం చతికిలబడనుందా అనేది మరికొన్ని గంటల్లో తేలబోతున్నది.
మహబూబ్‌నగర్ జిల్లా
సర్పంచ్ స్థానాలు : 142
అభ్యర్థులు : 466
వార్డు స్థానాలు : 1,065
అభ్యర్థులు : 2,065
జోగుళాంబ గద్వాల జిల్లా
సర్పంచ్ స్థానాలు : 56
అభ్యర్థులు : 180
వార్డు స్థానాలు : 495
అభ్యర్థులు : 1,030
నాగర్‌కర్నూల్ జిల్లా
సర్పంచ్ స్థానాలు : 147
అభ్యర్థులు : 469
వార్డు స్థానాలు : 1,269
అభ్యర్థులు : 3,087
నారాయణపేట జిల్లా
సర్పంచ్ స్థానాలు : 85
అభ్యర్థులు : 258
వార్డు స్థానాలు : 672
అభ్యర్థులు : 1,531
వనపర్తి జిల్లా
సర్పంచ్ స్థానాలు : 89
అభ్యర్థులు : 289
వార్డు స్థానాలు : 702
అభ్యర్థులు : 1,621