లింగాల, మార్చి 31 : దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు శుక్రవారం వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి ముందు.. వెనక అటవీ శాఖ అనుమతులతో ఉత్సవాలు జరగనున్నాయి. నల్లమలలోని దట్టమైన అడవిలో లోతట్టు ప్రాంతంలో లింగమయ్యగా శివుడు కొలువుదీరాడు. చెంచులే పూజారులుగా జరిగే అరుదైన ఉత్సవం ఇది. అంతటి ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు నుంచి లక్షలాదిగా తరలిరానున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. దట్టమైన అడవిలో దాదాపు 3 కిలోమీటర్లకుపైగా.. రాళ్లు, రాప్పలు ఎక్కుతూ.. అత్యంత సాహసోపేతంగా వేయి అడుగుల లోతులోని లోయలోకి దిగాల్సి ఉంటుంది. చిన్నా.. పెద్ద.. వృద్ధులు సైతం ఉత్సాహంగా తరలివస్తుంటారు.
ఓ చేతిలో కర్రను, భుజాలపై బ్యాగులు వేసుకుంటూ.. కొండలు, గుహల మధ్య, రాళ్లు, రప్పలపై నడుస్తూ.. ఓ వైపు కాళ్లు నొప్పులు పెడుతున్నా.. నీరసం వస్తున్నా.. మొక్కవోని దీక్షతో స్వామిని స్మరించుకుంటూ అడుగులో అడుగులు వేస్తూ కలిగే లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. వెళ్లే భక్తులు ‘వస్తున్నాం.. లింగమయ్యా’.. అంటూ.. తిరిగి వచ్చే భక్తులు ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ స్వామి నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగనున్నాయి. ఆధ్యాత్మిక భావనతో పాటుగా ట్రెక్కింగ్ మాదిరి కాలినడకన చేరుకోనున్నారు. అందుకే మరో అమరనాథ్ యాత్రగా పేర్కొంటారు. లోయలో పైనుంచి కిందకి దూకే జలపాతం.. అక్కడున్న గుండంలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామి దర్శనంతో పునీతులు కానున్నారు.
నల్లమలలో ప్రకృతి అందాలు ఎంత చూసినా తనివి తీరవు. అలాంటి ఆహ్లాదకర నల్లమల అడవి.. మరోసారి సలేశ్వరం జాతరతో ఆధ్యాత్మికతత పాటుగా చక్కని అనుభూతిని అందించబోతున్నాయి. అయితే అడవిలోని జీవరాశుల మనుగడకు ఆటంకం కలగకుండా ఉండేలా రాత్రి వేళల్లో భక్తులను అనుమతించడం లేదని అటవీ శాఖాధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో అటవీ, రెవెన్యూ, పంచాయతీ, వైద్యారోగ్య, రవాణా, తదితర శాఖల సమన్వయంతో భక్తులకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రత్యేకంగా పెట్రో లింగ్ టీంలను ఏర్పాటు చేశారు. అడవి మార్గంలో ఎవరైనా తప్పిపోయే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులను నియమించనున్నారు. యాత్రికులు ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వాడవద్దని, అటవీ ప్రాంతాల్లో ఎక్కడ వాహనాలు నిలపరాదని, మంటలు పెట్టరాదని సూచిస్తున్నారు.
ఇబ్బందులకు గురి చేస్తున్న నిబంధనలు
గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లుగా అటవీ శాఖ అధికారులు నిబంధనలు విధించి వాహనాలకు ఎంట్రీ ఫీజు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే సలేశ్వరాయానికి వెళ్లే రెండు మార్గాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే ఎంట్రీ ఫీజు ఎత్తేయాలని పలువురు వాహనదారులుకోరుతున్నారు.
రెండు మార్గాల మీదుగా భక్తులు
సలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు రెండు మార్గాల్లో తరలివెళ్తుంటారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా.. గిరిజగుండాల వరకు వాహనాలలో వెళ్లి.. అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలోని సలేశ్వరం క్షేత్రానికి కాలినడకన భక్తులు వెళ్తుంటారు. మరో మార్గం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని మన్ననూరు దాటిన తర్వాత ఫరహాబాద్ చౌరస్తా(పులి బొమ్మ) వద్దకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి అటవీ మార్గంలో 30 కి.మీ. రాంపూర్, అప్పాపూర్ చెంచు పెంట వరకు వాహనాలలో వెళ్లాలి. అక్కడి నుంచి దాదాపు 3 నుంచి 4 కి.మీ. వరకు కాలినడకన లింగమయ్య దగ్గరకి చేరుకోవాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆయా డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తుంది.