మానవపాడు,ఏప్రిల్ 21 : అకాల వర్షంతో తడిసిన పోయిన పంటలను పరిశీలించడానికి ఏఒక్క మంత్రికి సమయం లేదా అని అసలు ప్రభుత్వానికి రైతు గోస పట్టదా అని ఎమ్మెల్యే విజేయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మిరప, పొగాకు పంట తడిసిపోగా సోమవారం పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షంతో మిర్చి, పొగాకు పంట పూర్తిగా తడిసిపోయి నష్టపోయిన వాటిని పరిశీలించకుండా భూభారతి, రైతు సదస్సుల పేరిట పర్యటనలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
అలంపూర్ నియోజకవర్గంలో పొగాకు, మిర్చి పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశారని రెండేండ్లుగా పంటలకు మద్దతు ధర లేక రైతులు శీతల గిడ్డంగుల్లో పంట నిల్వ చేసుకున్నారని, అవకాశం లేని రైతులు కల్లాల్లోనే నిల్వ చేసుకుని ధర కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అకాల వర్షంతో తడిసిన పంటలను చూసేందుకు ఏఒక్క నాయకుడు కానీ, అధికారి కానీ రాకపోవడం సిగ్గుచేటన్నారు. వర్షంతో నష్టపోయిన రైతుల జాబితా సిద్ధం చేసి అంచనాలు రూపొందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి మంత్రులు, ప్రభుత్వానికి కానీ పట్టలేదని అన్నారు.
మిర్చి, పొగాకు రైతుల వద్ద ఉన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ.2లక్షల వరకు పెట్టుబడి అయిందని మరోవైపు సరైన మద్దతు ధర లేక కల్లాల్లోనే నిల్వ ఉంచుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఎమ్మె ల్యేకు వివరించారు. అమ్ముకోవడానికి ఎక్కడికి వెళ్లిన ధర లేకపోవడంతోనే మాకు ఈ పరిస్థితి దాపురించిందని, మిర్చి పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని రైతులు ఎమ్మెల్యేతో వాపోయారు.