అచ్చంపేట రూరల్: పెంచిన ఆర్టీసీ బస్సు పాస్ చార్జీలు ( Bus Charges) తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ (AISF ) నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలను నిరసిస్తూ బుధవారం ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్పాస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో పది లక్షలకు పైగా పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సులే ఆధారమని అన్నారు. చార్జీల పెంపు ద్వారా వారిపై పెనుబారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యజమాన్యం నెలకు రూ. 400 ఉన్న బస్సు పాస్ చార్జీని రూ. 600 పెంచుతూ, 3నెలల ప్యాకేజీని రూ. 1,200 నుంచి రూ 1,800 లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శోచనీయమని అన్నారు.
విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా చార్జీలను పెంచడం సరికాదని అన్నారు. ఆర్టీసీలో విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని పెంచిన డిమాండ్ చేశారు. ఈఏఐఎస్ఎఫ్ అచ్చంపేట్ నియోజకవర్గ కన్వీనర్ శివ ప్రసాద్, హరికృష్ణ, అనిల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.