AIPKMS | ఊట్కూర్, జూన్ 10 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(AIPKMS) ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సలీమ్, మండల కార్యదర్శి కే మల్లేష్, జిల్లా నాయకులు కనక రాయుడు డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతు లేకుండా వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ. 12,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు ఇవ్వాల్సిన రూ. 18 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బకాయి డబ్బులను ప్రతికూలి అకౌంట్లో జమ చేయాలని, గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ కూలీలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఐడి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూడు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నా, చిన్న కారు రైతులు ఏడాది పొడుగునా వ్యవసాయ కూలీగానే బతుకుతున్నారని, వీరందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని రకాల జబ్బులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వ్యవసాయ రంగంలో 60 శాతం వ్యవసాయ పనులన్నీ కూలీల మీదనే ఆధారపడి నడుస్తున్నాయని, తెలంగాణలో 60 లక్షల మంది వ్యవసాయ కూలీలకు బ్రతకడానికి నెలకు కనీసం రూ. 26 వేల నుండి రూ. 29 వేలు అవసరం అవుతున్నాయని దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు సమగ్రమైన చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి చెన్నప్ప ఆధ్వర్యంలో తాసిల్దార్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకట్ రెడ్డి, కే.లింగప్ప టీ ఎల్లప్ప, తిప్పయ్య, అమీన్పూర్ శంకరప్ప, రాజు పాల్గొన్నారు.