మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 17 : పాలమూరు యూనివర్సిటీని బోధన, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రగతి బాటలో నడిపిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. పీయూ వైస్ చాన్స్‌లర్‌గా గతేడాది అక్టోబర్ 18న బాధ్యతలు చేపట్టి నేటికీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన ’నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్సిటీలో నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నా రు. సమాజానికి మంచి నాయకత్వం అందించేందుకు విద్యను సాధనంగా ఉపయోగించే కా ర్యాచరణ రూపొందిస్తున్నామని, ఇందులో ఉ ద్యోగ, పరిశోధక, విద్యార్థి వర్గాలను భాగస్వా ములను చేస్తామన్నారు. వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వర కు సాధించిన ప్రగతి, రానున్న కాలంలో చేప ట్టే పనుల వివరాలు ఆయన మాటల్లోనే..!
పరిమితమైన వనరులతో వర్సిటీ అభివృద్ధి పనులు చేపట్టాం. పీఎం ఉషా పథకం కింద రూ.100కోట్లు నిధులు విడుదల అయ్యాయి. విశ్వవిద్యాలయం అకాడమిక్ బ్లాక్‌లు, హాస్ట ల్స్, లైబ్రరీ, పరిశోధన సౌకర్యాలు, క్రీడా మౌ లిక సదుపాయాలతో ఆధునిక క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తాం. క్యాంపస్‌లో రూ.10కోట్లతో బాలికలు, బాలుర వసతి గృహం ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రీయ పరిశోధన సౌకర్యాలు కల్పించేందుకు రీసెర్చ్ బిల్డింగ్‌కు రూ. 13.50కోట్లు వెచ్చించి నిర్మాణాలు ప్రారంభించాం. ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి రూ.35కోట్లు, లా కళాశాల నిర్మాణానికి రూ. 15కోట్లు, న్యాయ, ఇంజినీరింగ్ హాస్టళ్లు (బాలురు, బాలికలు) రూ.25కోట్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారం (సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు రూ.5కోట్లు వెచ్చించనున్నాం.
ఈ ఏడాది నాక్కు వెళ్లి బీ గ్రేడ్ సాధించాం. మొట్టమొదటిసారి పాలమూరు యూనివర్సి టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో టీజీపీఈ సెట్ ను విజయవంతంగా నిర్వహించాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సెట్ల నిర్వహణకు కృషిచేస్తాం. విద్యార్థి సాధికారతే ల క్ష్యం గా విస్తృత స్థాయిలో ప్లేస్మెంట్ డ్రైవ్‌లు, పోటీ పరీక్షలకు కోచింగ్, సీఈఎల్‌టీ (సెల్ట్), పీయూ స్టడీ సర్కిల్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని ది స్కేల్ ఇన్స్టిట్యూట్తోనూ, టా స్క్తో నైపుణ్య అభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌ల కో సం ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఐసీఎస్ఐతో కామర్స్ మేనేజ్మెంట్తో, ఆరేకేఎం ఫార్మా, విజ్డమ్ లైఫ్ సైన్సెస్, ఎంఎస్‌డబ్ల్యూ ,ఎంజీఎన్సీఆర్ఐ ఒప్పందాలు చేసుకున్నాం.
ఈ ఏడాదిలో 50కి పైగా సెమినార్లు, స మావేశాలు నిర్వహించాం. యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ నోట్రే డామ్ సహకారం తో ఏడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రో గ్రాం నిర్వహించాం. విద్యార్థులకు యూజీసీ స్వయం పోర్టల్ ద్వారా మూక్స్‌లో నమోదు చేసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహిం చాం. ముఖ్యంగా ఏఐ, బిగ్ డాటా ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెట్టేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపడుతున్నాం.
నూతనంగా ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్, లా కళాశాల ప్రారంభించాం. కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ రంగాలలో బీటెక్ కోర్సులను అందిస్తున్నాం. ప్రారంభమైన మొ దటి సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో వందశాతం ప్రవేశాలు సాధించిన విశ్వవిద్యాలయంగా పాలమూరు నిలుస్తోంది. లా కళాశాల రెండు సెక్షన్లతో మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సు, మేధోసంపత్తి చట్టంలో రెండు సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తున్నాం. ప్రవేశాలు జరుగుతున్నాయి.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 115 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా 11,500 మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. విశ్వవిద్యాలయం ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు, గ్రామ దత్తత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలూమ్నీ పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నాం. చాన్స్‌లర్ కనెక్ట్స్ అలూమ్నీ కార్యక్రమంలో 300మంది పూర్వ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విద్యార్థులు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఏఐయూ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించారు.
ముఖ్యంగా రానున్న రోజుల్లో వర్సిటీలో రెగ్యూలర్ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినా అనివార్య కారణాలతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇది పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. సాధ్యమైనంత త్వరగా ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం. జాబ్ ఓరియంటేషన్ కోర్సులు ప్రవేశ పెడ్తాం. ప్లేస్మెంట్ సెల్‌ను మరింత విస్తృత పరుస్తాం.