వనపర్తి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ) : వరి ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో కోతలు వేగం పుంజుకునే అవకాశం ఉన్నది. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో సన్న వరి సాగుబడులకు అన్నదాతలు ప్రాధాన్యతనిచ్చారు. నాలుగేండ్లుగా జిల్లా లో సీఎంఆర్ విధానంలో అంతా గోల్మాల్ జరిగింది. జిల్లాలో దాదాపు 184 రైస్ మిల్స్ ఉండగా, ఈ సీజన్లో వాటికి సీఎంఆర్ ధ్యాన్యం కేటాయింపులు కష్టం గా మారాయి. రైస్‌మిల్లులకు కేటాయించకుండా నేరు గా ప్రభుత్వం కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిలు వ చేస్తారు. ఇందుకు తగ్గట్టుగా జిల్లాలో గోడౌన్లు ఉన్నాయాలాంటి వాటిపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కీమ్యానాయక్ను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
నమస్తే తెలంగాణ : జిల్లాలో కొనుగోళ్లు ఎప్పుటి నుంచి ప్రారంభిస్తారు..?
అదనపు కలెక్టర్ : జిల్లాలో వరి కోతలు షురు అయిన ప్రాంతాల్లో కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని చెప్పాం. మరో రెండు, మూడు రోజుల్లో అవసరం ఉన్న చోట్ల సెంటర్లు తెరుస్తారు. తూకాలను కూడా మొదలు పెడతారు. ధాన్యం సిద్ధంగా ఉంటే సెంటర్ పని మొదలు పెట్టాల్సిందే.
న,తె : ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ?
అదనపు కలెక్టర్ : జిల్లాలో 414 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 172 ఐకేపీ పరిధిలో ఉంటే, మరో 241 సింగిల్‌విండోల ద్వారా, మ రో 8 సెంటర్లు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తు న్నాం. గతం కంటే ఈ దఫా కొన్ని సెంటర్లు పెంచాం.
న,తె :సెంటర్ల పనితీరు మెరుగు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అదనపు కలెక్టర్ : జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సెంటర్ల నిర్వాహకులకు ఒక దఫా శిక్షణ కూడా ఇచ్చాం. కొనుగోళ్లకు అవసరమైన టార్పాలిన్లు, వే యిం గ్ మిషన్లు తదితరవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సెంటర్ల వారీగా ఏర్పాట్లు కూడా జరిగాయి. ధా న్యం శుభ్రపర్చడం కోసం 40 మిషన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నాం.
న,తె : ఎంత ధాన్యం వస్తుందని అంచనా ఉంది?
అదనపు కలెక్టర్ : వానకాలం సీజన్లో వ్యవసాయశాఖ లెక్కల ఆధారంగా జిల్లాలో 2లక్షల ఒక వెయ్యి 477 ఎకరాల్లో వరి సాగు ఉంది. వీటి ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నాం. వీటిలో రైతుల అవసరాలకు 50వేల మెట్రిక్ టన్నులు ఉంచుకుంటారనుకుంటే.. అది పోనూ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. తేమ శా తం సరిపడా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
న,తె : జిల్లాలో ఎన్ని మిల్లుకు ధాన్యం కేటాయించే పరిస్థితి ఉంది?
అదనపు కలెక్టర్: జిల్లాలో 184 మిల్లులున్నాయి. మరో వారం పది రోజుల అనంతరం దాదాపు 60 మిల్లులకు అర్హత వస్తుందని అంచనా ఉన్నది. డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఈ సారి ఉండవు. గతంలో ధాన్యం తీసుకున్న మిల్లర్లు గడువులోగా క్లియరెన్స్ కావాల్సిందే. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లర్లు నడుచుకోవాలి.
న,తె : ధాన్యం నిలువలకు గోడౌన్లు ఉన్నాయా?
అదనపు కలెక్టర్ : ప్రస్తుత సీజన్లో ధాన్యం అధికంగా వస్తుందని అంచనా ఉన్నది. దీనికి తగ్గట్టుగా గోడౌన్లను కూడా గుర్తిస్తున్నాం. ఇప్పటికిప్పుడు అవసరమైతే 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేలా వనరులు సిద్ధంగా ఉన్నాయి. వీటి అనంతరం మిల్లులు తదితర చోట్ల ఆధారపడాలి. ఇతర జిల్లాలకు కేటాయింపులపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం లేదు.
న,తె : మిల్లర్లకు ఎలాంటి నిబంధనలు పెడుతున్నారు?
అదనపు కలెక్టర్ : ప్రతి మిల్లు యజమాని కూడా బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలి. ఇలా గ్యారెంటీలు ఇచ్చి న వారినే పరిగణలోకి తీసుకుంటాం. వారికే ధాన్యం కేటాయింపులు ఉంటాయి. ఇందులో ఎవరికి మినహాయింపులు లేవు.