నాగర్‌కర్నూల్, జనవరి 11: పండుగ పూట ప్రయాణం భారమైంది. సంక్రాంతి పండుగ కు సొంత ఊర్లు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఆర్టీసీ భారం మోపుతున్నది. స్షెషల్ బస్సుల పేరిట పల్లెవెలుగు బస్సులకు పట్నం బోర్డులు తగిలించి అధిక చార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధిక చార్జీలు పెట్టి కూడా దూర ప్రాంతాలకు నిలబడి పోవాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
తెలంగాణలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టి అబాసుపాలవుతున్నది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అవసరమైన మేరకు బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య 70శాతం పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సులను సైతం పెంచాల్సిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోకుండా ఉన్న బస్సులనే నడిపిస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ క్రమంలో సీట్లు కోసం మహిళలు సిగపట్లు పట్టుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఆయా డిపోల పరిధిలో బస్సుల సంఖ్య పెంచాల్సిన ఆర్టీసీ అధికారులు ఉన్న బస్సులను కుదించడంతో రాత్రివేళల్లో గమ్యానికి చేరుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని డిపోల పరిధిలో స్పెషల్ బోర్డులు వేసుకొని మహిళలను సైతం బస్సుల్లో ఎక్కించుకోవడం లేదని తెలుస్తోంది. గం టల తరబడి ఎదురు చూసిన మహిళలకు స్పెషల్ బస్సుల్లో చుక్కెదురవుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిపోల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులకు పట్నం బోర్డులు వేసి పురుష ప్రయాణికుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి నడిపిస్తున్న కొ న్ని పల్లె వెలుగు బస్సులకు దూర ప్రాంతాల బో ర్డులు వేసి స్పెషల్ పేరుతో అధికంగా చార్జీలు వసూ లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పల్లె వె లుగు బస్సులను హైదరాబాద్, గచ్చిబౌలి ప్రాం తాలకు నడుపుతూ పురుష ప్రయాణికులతో అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల నుంచే తమకు ఆదేశాలు ఉన్నాయం టూ దబాయిస్తున్నారు.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడంతో ఇదే అదనుగా భావించిన ఆర్టీసీ అధికారులు రెగ్యులర్‌గా నడిపించే బస్సులకే దర్జాగా సంక్రాంతి స్పెషల్ బోర్డులు వేసి అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. శనివారం నాగర్‌కర్నూల్ బస్టాండ్‌లో కొల్లాపూర్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు కండక్టర్‌తో ప్రయాణికులు ఘర్షణకు దిగారు. కొల్లాపూర్ డిపో నుంచి సంక్రాంతి స్పెషల్‌గా ఎక్స్‌ప్రెస్ బో ర్డుతో వచ్చిన టీఎస్ 09జెడ్ 8101 నెంబర్ గల బస్సు ఉదయం 6:30గంటల సమయంలో నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నది. ఈక్రమం లో నాగర్‌కర్నూల్‌లో ఆ బస్సు ఎక్కిన పురుష ప్ర యాణికులతో కండక్టర్ టికెట్ ఇచ్చి అధికంగా వ సూలు చేశాడు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది.
నాగర్‌కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు రూ.180 కాగా నాగర్‌కర్నూల్ ఎక్కిన ప్రయాణికు ల నుంచి అదనంగా రూ.110 వసూలు చేసి రూ.290 టికెట్ ఇస్తుండడంతో ప్రయాణికులు వా గ్వాదానికి దిగారు. డిపో మేనేజర్‌కు ఫోన్ చేసినా సరైన సమాధానం రాకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. బస్సు ఎదుట నిరసనకు దిగారు. ఈఘర్షణ జరుగుతుండగానే నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన టీజీ 31జెడ్ 0029 అనే ప ల్లెవెలుగు బస్సు పట్నం(గచ్చిబౌలి) బోర్డుతో బ స్టాండ్‌కు చేరుకున్నది. ఈ బస్సును చూసిన కొం ద రు ప్రయాణికులు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చంక లు గుద్దుకునే ప్రభుత్వం పల్లెలకు నడిపించాల్సిన పల్లెవెలుగు బస్సును పట్నం బోర్డు వేసి హైదరాబా ద్ నడుతపుతుందని విమర్శించడం కనిపించింది.
సంక్రాంతి స్పెషల్ అంటూ హైదరాబాద్‌కు నడిపించే బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టికెట్ తీసుకొని కూడా దూరప్రాంతాలకు నిలబడి పోవాల్సి వస్తుంది. అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఉన్నతాధికారులు ఆదేశాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినా సరిపడా బస్సుల సంఖ్య పెంచలే. టికెట్టుతో ప్రయాణించే పురుషులకు బస్సు ప్రయాణం నరకంగా మారింది. ఎప్పుడు ఏ బస్సు ఎక్కినా నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది.
– రాజాగౌడ్, ప్రయాణికుడు