కొల్లాపూర్ : అదనపు యూరియా కేంద్రాల ( Urea Centers ) పేరుతో కొత్త నాటకానికి తెర లేపిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నాగర్ కర్నూల్ జిల్లా రైతులు తిరగబడ్డారు. పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు కేంద్రానికి రైతులు తాళాలు వేసి నిరసన (Farmers protest ) వ్యక్తం చేశారు.
యూరియా కొరత లేకుండా గ్రామాలలో అదనపు యూరియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. కానీ యూరియా కేంద్రంలో యూరియా లేకపోవడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం పడిగాపులు కాసిన ముష్టిపల్లి, మరికల్, చంద్రకల్, పెరుమాళ్ళపల్లి రైతులు ఆగ్రహం తో యూరియా కేంద్రానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని నిర్వాహకులను రైతులు ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టేందుకు పేరుకు మాత్రమే అదనపు యూరియా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దకొత్తపల్లి సింగిల్ విండో, కొత్తపేట సింగిల్ విండో కార్యాలయాలు 167 కె జాతీయ రహదారిపై ఉండటంతో యూరియా కోసం రైతుల పడిగాపులు ప్రపంచానికి తెలుస్తుందని ముష్టిపల్లి, వెనచెర్ల గ్రామాలలో అదనపు యూరియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొత్త నాటకం ఆడినట్లు రైతులు ఆరోపించారు.
ప్రభుత్వానికి యూరియా ఇచ్చే ఉద్దేశం ఉంటే సింగిల్ విండో కార్యాలయాల్లోనే యూరియాను రైతులకు తగినంత మొత్తంలో అందజేసి ఉండేదని విమర్శించఆరఉ. అదనపు యూరియా కేంద్రాలలో యూరియా రైతుల డిమాండ్ మేరకు లేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.