Mahabubnagar | మూసాపేట(మహబూబ్ నగర్), జూన్ 08 : మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ సృష్టించిన బీభత్సానికి ఓ మహిళ బలైంది. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మూసాపేట మండల పరిధిలోని పోల్కంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లతే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేటకు చెందిన శంషుద్దీన్, షఫీ కలిసి పోల్కంపల్లి స్టేజీ సమీపంలోని వైన్స్ వద్ద పీకల దాకా మద్యం సేవించారు. అనంతరం పోల్కంపల్లిలోని తమ స్నేహితుడు హబీబ్‌ను కలిసేందుకు శంషుద్దీన్, షఫీ కలిసి కారులో బయల్దేరారు. కారును విచ్చలవిడిగా నడుపుతూ ఆ గ్రామంలో బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గంజి శివరాములు భార్య స్వప్న (24)ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే వేగంతో వెళ్తూ గ్రామానికి చెందిన బోల శ్రీశైలం కుమారుడు శివను ఢీకొట్టారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన శంషుద్దీన్ పరారీ కాగా, షఫీని గ్రామస్తులు పట్టుకున్నారు. శంషుద్దీన్ ఆచూకీ చెప్పాలని షఫీని గ్రామస్తులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు పోల్కంపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మహిళ మృతికి కారణమైన శంషుద్దీన్, షపీని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్వప్న మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు(6), కుమార్తె(4) ఉంది. కూలి పనులు చేసుకుంటూ స్వప్న కుటుంబాన్ని పోషిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.