మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండేళ్లు అవుతున్నా గ్రామాల్లో.. పట్టణాల్లో.. జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి జరగడం లేదని.. ఉమ్మడి జిల్లాకు నిధులు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శలకు దిగుతున్నారు.
నిధులు గ్రామస్థాయిలో కేటాయించాలని ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ బాకా పత్రికలో ఏకంగా ఆర్టికల్ రాశారు. దీనికి వంత పాడుతూ జడ్చర్ల దేవరకద్ర ఎమ్మెల్యేలు కూడా ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకే నిధులు తరలిస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నిధులు ఎందుకు రావడం లేదని సీఎంను గట్టిగా నిలదీస్తున్నారు. అసెంబ్లీలోని తేల్చుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మీడియా ముందే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ పాలమూరు జిల్లాకు చెందిన వారైనా నిధులు రాబట్టడంలో విఫలమవుతున్నామని అసంతృప్తితో పలువురు ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర మంత్రివర్గం అంతా ఒకే
వేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని జనం చప్పట్ల మధ్య ఒప్పించారు. పది నెలలు అవుతున్నా నయా పైసా కూడా విడుదల కాకపోవడంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రేగుతున్నది. గ్రామాలకు వెళ్లినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్ముతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కార్యకర్తలు గ్రామాల్లో పనిచేయడానికి పనులే లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. పనులు చేసిన ప్రజాప్రతినిధులకు బిల్లులు రాక.. సర్కారు ఖజానాలో చిల్లి గవ్వ లేక విమర్శలు చేస్తున్నా ఎమ్మెల్యేలు ఉత్సాహ విగ్రహాలుగా మారిపోయారు. గ్యారెంటీ పథకాలు కూడా అమలు కాకపోవడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తి రేగుతోంది. మొత్తంపైన ఉమ్మడి జిల్లా నుంచి తిరుగుబాటు మొదలు కావడంతో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైంది.
నల్లగొండ, ఖమ్మం జిల్లాల లెక్కలు అడుగుతాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ఎన్ని నిధులు వెళ్లాయో? వాటి లెక్కలు అసెంబ్లీలో తేలుస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అల్టిమేటం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మహబూబ్‌నగర్ జిల్లాకు నిధులు ఇవ్వకుండా.. అక్కడికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించిన పాలమూరును నిర్లక్ష్యం చేయడం ఏమిటని పరోక్షంగా విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు.
ఈ జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్నా ఎందుకు నిధులు రావడంలేదని మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మందిని గెలిపించి ఏం ప్రయోజనం అని బాహాటంగా విమర్శిస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్న సీఎం ఎందుకు కట్టడి చేయడం లేదు అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజుకి పెరుగుతున్నది.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నిధులేవి?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటుతున్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు సాగడం లేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు.. తప్ప నేను పైసా ఖర్చు చేయడం లేదు. అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు.. వాటిని నెరవేర్చలేక సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి ఆగిపోయింది. గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యేలకు పనులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. హామీలు ఇవ్వలేక పనులు చేపడుతామని చెప్పలేక ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి ఆగిపోయింది. సమీక్ష సమావేశాలు తప్పితే ఒక్క పని కూడా జరగడం లేదు.
ఏడాదికి రూ.20 వేల కోట్లు ఏమయ్యాయి?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలో రైతు పండుగ పేరిట సంబురాలు నిర్వహించారు. ఈ రైతు పండుగలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గమంతా ఇ క్కడే పాల్గొంది. మంత్రుల సాక్షిగా సీఎం మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. రూ.20 వేల కోట్లు ఆయా మంత్రివర్గ శాఖల నుంచి ఇచ్చేలా ఒప్పించి ప్రజల చేత చప్పట్లు కొట్టించారు. దాదాపు పది నెల లు అవుతున్నా రూ.వేల కోట్లు కాదు కదా రూ.లక్ష కూడా విడుదల కాకపోవడంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సీఎంను ఉ ద్దేశించి రూ.20 వేల కోట్లు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించడం గమనార్హం. అంతటితో ఆగకుండా ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే బాకా పత్రికలో ఆర్టిక ల్ రాయడం.. దానికి సమర్థిస్తూ ఇంకో ఎమ్మెల్యే రూ.25 కోట్లు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో పెట్టాలని డిమాండ్ చేయడం.. మరో ఎమ్మెల్యే డిమాండ్‌ను సమర్థించడం చూ స్తుంటే ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మా ప్రమేయం లేకుండా పార్టీలో చేర్చుకోవద్దు
పాలమూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ సీఎం కాగానే చాలామంది చంద్రబాబు శిష్యులు పదవులపై ఆశతో ఉన్నారు.. వారిని రేవంత్ శిబిరంలోకి ఒక్కొక్కరుగా ఆహ్వానిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతున్నారని.. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదట. తాజాగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. బీజేపీలోకి.. చివరకు బీఆర్ఎస్లో చేరి.. మళ్లా కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న శేఖర్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అంతటితో ఆగకుండా సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపినోడు.. మళ్లా ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నన్ను కూడా చంపుతాడేమో? అని వ్యాఖ్యానించడం సంచలనానికి దారి తీసింది. సీఎం రేవంత్‌పై అనిరుధ్‌రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు.
ఇటు పార్టీలో.. అటు అసెంబ్లీలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. అయినా సీఎం శిబిరం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. కనీసం కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆరు నెలలకు కింద పది మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని సమావేశం ఏర్పాటు చేశారు.. చివరకు ఏమైందో ఏమో కానీ ఓ సీనియర్ మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇది సద్దుమణిగింది. ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. పార్టీలోకి ఎవరు రావాలన్నా.. వెళ్లాలన్నా డీసీసీ పదవి ఎవరికి ఇవ్వాలన్నా.. తమను అడిగి తీసుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఎర్రశేఖర్ ఉదాంతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం జరిగింది.. కాబ ట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. మొత్తంపైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.