మక్తల్, మే 23 : కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని మండలంలోని కాట్రేవుపల్లి, ఎర్నాగనిపల్లి రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని కాట్రేవుపల్లి, ఎర్నాగన్పల్లి గ్రామ శివారులో భూముల హద్దులు నిర్ణయించడానికి వచ్చిన నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులను రైతులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోకపోవడంతో చేసేది లేక తిరుగుముఖం పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి నీటిని తీసుకువెళ్లేందుకు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పేరుతో భూములను తీసుకోవాలని ప్రభుత్వం చూస్తే మా భూములను ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పనంగా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు.
గతంలోనే భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో కాట్రేవుపల్లి గ్రామానికి చెందిన రైతులు 70% భూమి కోల్పోవడం జరిగిందని రైతులు వాపోయారు. మళ్లీ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో గ్రామ శివారులో మిగిలి ఉన్న కాస్తంత భూమిని మరో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటామంటే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మేము ఎక్కడివెళ్లి బతకాలని అధికారులను నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు తీసుకుంటాం, సర్వేలు చేస్తామని చెప్తున్నారు తప్పా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరిహారం ఇస్తారో, రైతులకు భూమికి భూమి ఇస్తారా, లేక పరిహారాన్ని చెల్లిస్తారు అన్న విషయాలన్ని అధికారులు రైతులకు చెప్పకుండా పోలీసు బలగాలతో వచ్చి బలవంతంగా రైతుల భూములు సర్వే చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా అధికారులు మా భూములు కావాలంటే ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వడంతోపాటు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చేందుకు ముందుకు వస్తేనే మా భూములను ఇస్తామని లేదంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.