కోస్గి, ఆగస్టు 29 : కోస్గి ప్రజల 70 ఎండ్ల కల అతి త్వరలో నెరవేరనున్నది. పట్టణంలో 50 పడకల దవాఖాన మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు 50 పడకల దవాఖానలను మంజూరు చేసింది. కొడంగల్ నియోజకర్గంలోని కొడంగల్, మద్దూర్‌లో వీటి నిర్మాణం పూర్తి కాగా కోస్గిలో కొంత జ్యాపం కారణంగా పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి. నూతన హాస్పిటల్ ప్రారంభమైతే ప్రజలు కార్పొరేట్‌కు బదులు సర్కారు దవాఖానకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కోస్గి ప్రభుత్వ దవాఖానలో రోజుకు 250 ఓపీలు వస్తున్నాయి. ప్రతి నెలా 30వరకు నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. నూతన దవాఖాన ప్రారంభమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యే పట్నం చొరవతో దవాఖాన పనులు వేగంగా పూర్తయ్యాయి. ప్రభుత్వం రూ.5.5కోట్లు మంజూరు చేయగా రెండంతస్తుల బిల్డింగ్ పనులు పూర్తి చేశారు. నర్సులు, సూపరిండెంట్, లేబర్, ఆపరేషన్, వార్డుకు సంబంధించిన రూమ్‌లు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. నీటి సౌలభ్యం కోసం ఒక సంపు, 2వేల లీటర్ల ట్యాంక్‌లు రెండింటిని నిర్మించి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేశారు. నూతన భవనంలోకి దవాఖానను మార్చి కొత్త స్టాఫ్ వస్తే మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభ్వుత్వానికి పంపించినట్లు స్థానిక వైద్యుడు అనుదీప్ తెలిపారు.
ఓపీ పెరిగే అవకాశం ఉంది..
కోస్గిలో 50 పడకల దవాఖాన అందుబాటులోకి వస్తే నార్మల్, సిజేరియన్ ప్రసవాలు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఓపీ 250 వరకు ఉంది. నూతన దవాఖాన ప్రారంభమైతే 400-450 వరకు ఓపీ పెరుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించింది. కావునా ప్రజలు కార్పొరేట్‌కు బదులు ప్రభుత్వ దవాఖానల సేవలు వినియోగించుకోవాలి.
– అనుదీప్, కోస్గి ప్రభుత్వ దవాఖాన వైద్యుడు