మహబూబ్‌నగర్, ఆగస్టు 15: ప్రజలకు పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించేలా తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 78వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గురువారం ఆయన మహబూబ్‌నగర్‌లోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నదన్నారు.
మహాలక్ష్మి పథకం కింద 83.33లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీనిద్వారా ఆర్టీసీకి రూ.40.32కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 4లక్షల 50వేల గృహాలు నిర్మించుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మించనున్నామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అర్హులైన లక్షా 90,682మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గృహజ్యోతి పథకంలో 1,19,834 మందికి జీరో బిల్లులు జారీ చేశామన్నారు. రాజీవ్ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10లక్షల వరకు పెంచామన్నారు.
రైతు రుణమాఫీలో భాగంగా మొదటి, రెండో విడుతలో రూ.440 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాను ప్రగతిలో మరింత ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతేకాక ఆయా శాఖల అభివృద్ధిని తెలియజేసి విధంగా రూపొందించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సైతం మంత్రి సందర్శించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే ఆరుణ, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ మోహన్రా వు, మహబూబ్‌నగర్, దేవరకద్ర శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.