వనపర్తి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : పండిన ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంటల దిగుబడుల అం చనాలు సక్రమంగా లేక పలు రకాల సమస్యలను రైతు లు అనుభవిస్తున్నారు. గన్నీ బ్యాగులు లేకపోవడం.. కోతలు కోసి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడంలాంటివి అన్నదాతలకు ఆటంకం కల్గిస్తున్నాయి. విత్తనాల దగ్గర నుంచి ధాన్యం విక్రయాల వరకు ఎలాంటి కష్టాలు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనులను సాఫీగా నడిపించింది. ఈ ఏడాదిలో ఎరువులు దొరక్క రాత్రి.. పగలు తేడా లేకుండా అన్నదాతలు పడిగాపులు కాసిన సంగతి విదితమే. ఈ క్రమంలో మరో పక్షం రోజుల్లో వానకాలం వరి పంట చేతికి రాబోతున్నది. జిల్లాలోని 15 మండలాల్లో ఈ వానకాలం వరి విస్తీర్ణం భారీగానే పెరిగింది. ఇటు జూరాల, అటు భీమా మరోవైపు ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లా పరిధిలోని మండలాలకు సాగునీరు అందింది. వానకాలం వర్షాలు గత రెండు నెలలకు పైగా కురుస్తుండగా, ఇప్పటికీ వానలు వదలలేదు. పుష్కలమైన వర్షాలు కేవలం వరికి మాత్రమే అనుకూలించాయి. మిగిలిన మెట్ట పంటలకు వాన కాలం సీజన్లో పెద్ద దెబ్బగానే రైతులు చెబుతున్నారు. అధిక వర్షాల వల్ల మెట్టపైర్లన్నీ నాశనం అయ్యాయని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానకాలంలో 2,01,477 ఎకరాల్లో వరి సాగు చేసినట్ల్లు వ్యవసాయాధికారులు చెబుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 414 కొనుగోళు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుం ది. ఐకేపీ మహిళా సంఘాల ద్వారా 192కేంద్రాలు, పీఏసీసీఎస్‌ల ద్వారా 241, మెప్మా నుంచి మరో 8 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా వరి కోతలు ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాల్లో మొదలయ్యే అవకాశం ఉన్నది. అలాగే జూరాల కాల్వ ఆధారం ఉన్న ప్రాంతాల్లోనూ ఈదఫా ముందస్తుగానే వరి చేతికి వస్తుంది. దీపావళీ పండుగ అనంతరం జిల్లా వ్యాప్తంగా అధిక మండలాల్లో వరి కోతలు వేగం పుంజుకునే వీలుంది. కాగా, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్, టార్ఫాలిన్ కవర్ల సమకూర్పులో గత సీజన్లో ఇబ్బందులను రైతులు ఎదుర్కొన్నారు. వీటితోపాటు సమయానికి గన్ని బ్యాగులు లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొనుగోళు చేసిన ధాన్యా న్ని మిల్లులకు తరలించడంలోనూ రైతులకు చుక్కలు చూపించారు. మిల్లర్లు తాలు ఉందంటూ ఎడాపెడా ధాన్యాన్ని కట్ చేసుకున్నా అడిగేనాథుడే కరవయ్యారు. ఇలాంటి అనేక సమస్యలతో రైతులు గత సీజన్లో సతమతమయ్యారు.
ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. జూరాల ప్రాజెక్టు పరిదిలోని మండలాల్లోనూ వరి శిస్తు భారీగా చేపట్టారు. జిల్లా పరిధిలోని 15 మండలాల్లోనూ ప్రాజెక్టుల నీటితోపాటు బోరు, బావుల కింద వరి సాగుబడులు పుష్కలంగా జరిగాయి. అయితే గత యాసంగి సీజన్లో తలెత్తిన సమస్యలను పునరావృతం కాకుండా తగినరీతిలో ఏర్పాట్లు చేయడంలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే ఈ సీజన్లో సన్నరకం వడ్లు 3లక్షల 57వేల మెట్రిక్ టన్నులు, అలాగే దొడ్డురకం వరి 73 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా ఉన్నది.
వరి ధాన్యం నిల్వ చేసేందుకు గోడౌన్లు ఖాళీగా లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. జిల్లాలో దాదాపు 18వరకు గోడౌన్లు ఉన్నప్పటికీ ధాన్యంతో నిండి ఉ న్నాయి. యాసంగి ధాన్యమే కాకుండా అంతకు ముం దు ధాన్యం కూడా జిల్లాలోని గోడౌన్లలో నిల్వ ఉంది. ప్రతి ఏటా వరి శిస్తులు పెరుగుతుండటం వల్ల ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో అంతుబట్టని సమస్యగా మారుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరి సాగుబడులున్నందునా అక్కడా అవకాశం లేకుం డా పోతున్నది. దీంతో ఎటు చూసినా ధాన్యం నిల్వలో సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నా యి. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తప్పా మరొక మార్గం కనిపించడం లేదు.
జిల్లాలో వరి సాగు అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనువైన వర్షాలు రావడం ఒకటైతే.. క్వింటాల్ సన్న వరికి రూ.500 బోనస్ ప్రకటించడం రెండోదిగా కనిపిస్తుంది. దొడ్డు, సన్న రకాల వరిలో నెల రోజుల తేడాతో పంట వస్తుంది. దొడ్డురకం ఒక నెల ముందుగానే వచ్చేస్తుంది. నీటి ఇబ్బందులున్న రైతులు, అలాగే రెండో పంటను దృష్టిలో ఉంచుకునే వారంతా అధికంగా దొడ్డు రకాలనే ఎంచుకుంటారు. అయితే, ఈసారి ఈసీజన్లో నీటి సమస్య లేదు. దీంతో ప్రతి ఏటా 2 లక్షల ఎకరాలలోపున్న వరి శిస్తూ.. ఏకంగా 2.20 లక్షల ఎకరాలకు చేరుకున్నట్లు అనధికార అంచనా. ఇదిలా ఉంటే..
బోనస్ పేరుతో అధిక శిస్తు అవుతున్నా.. బోనస్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. ఇప్పటి వరకు యాసంగి బోనస్‌ను ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్ల బోనస్ బకాయి ఉన్నది. దీనికి సర్కారు అది.. ఇది అంటూ చివరకు ఎగనామం పెడుతుందా అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వానకాలం వరి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం. 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది. ఇందుకు 414 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్స్‌ను అందుబాటులో ఉంచి పని వేగవంతానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం గోడౌన్ల సమస్య ఉన్నప్పటికీ కొనుగోలు ప్రారంభమయ్యే నాటికి సమస్యను అధిగమిస్తాం. రైతులు ధాన్యాన్ని శుభ్రంగా తేవడం.. మాయిశ్చర్ కూడా సక్రమంగా ఉండేలా చూడాలి.
– పార్థసారథి, డీఎస్వో, పౌరసరఫరాల శాఖ, వనపర్తి