24గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చేసే ఏకైక వ్యవస్థ పోలీస్. తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులు. దండెత్తి శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసాను ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీసు..’ అంటూ ఓ సినిమాలో ఉన్న ఈ డైలాగ్ పోలీసు గొప్పతనాన్ని చాటుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనది. ఒంటిపై పోలీసు యూనిఫాం.. తలపై టోపీ.. ఆ టో పీపై మూడు సింహాలు.. చేతిలో లాఠీ.. ఈ ఆహార్యంతో కళ్లెదుట నడిచొచ్చే న్యాయమే పోలీసు.. అంతర్గత శత్రువుల నుంచి కాపాడి ప్రజలకు భద్రత, భరోసా ఇస్తున్నారు. ఉగ్రవాదులు, ముష్కరుల దాడి నుంచి దేశాన్ని రక్షించడం.., అసాంఘిక శక్తుల ఆటకట్టించడం.., ప్రజల మాన ప్రాణాలకు కాపాడటంలో వారి సేవలు అభినందనీయం. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి అసువులు బాసిన వీరుడా వందనం.. అభివందనం. భరతమాత కోసం క్రమశిక్షణతో, అంకితభావంతో, నిబద్ధతతో కర్తవ్య నిర్వహణలో జిల్లాకు చెందిన పలువురు ప్రాణాలర్పించారు. నాటి వారి త్యాగఫలమే నేటి మన సంతోష జీవనం.. ప్రజాస్వామ్యం, సమాజ పరిరక్షణ కోసం నిరంత రం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నీరతిని ఓసారి స్మరించుకుందాం.. పో లీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పది రోజులపాటు ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాలు చేపడుతున్నారు.. నేడు ఫ్లాగ్‌డే సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ/వనపర్తి/గద్వాల అర్బన్, అక్టోబర్ 20
‘ఫ్లాగ్‌డే’గా పేరు మార్పు..
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఫ్లాగ్ డేగా పేరు మార్చారు. ఏటా అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను ఈ సారి 21 నుంచి 31వ వరకు నిర్వహిస్తున్నారు. 21వ తేదీన ఆయా జిల్లాల పోలీస్ కార్యాలయా ల ఆవరణలో ఫ్లాగ్ డే నిర్వహించనున్నారు. ఇక ఓపెన్ హౌస్ కార్యక్రమం, రక్తదాన శిబిరం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయనున్నారు. తొలిరోజు కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించనున్నారు. కాగా, సామాజిక సేవ, పోలీసుల విధులపై అవగాహన కల్పించడం, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలింలపై వనపర్తి జిల్లా లో పోటీలు నిర్వహిస్తున్నారు. 23వ తేదీలోగా వివరాల తో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమర్పించాలని, విజేతలకు ప్ర శంసాపత్రాలు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యం..
1959 అక్టోబర్ 21వ తేదీన జమ్ముకశ్మీర్ రాష్ట్రం లడక్ జిల్లాలోని లెహ్ ప్రాంతంలోని 16 వేల అడుగుల ఎత్తులో మైనస్ 35 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మనషులు గడ్డకట్టే ఆ చలిలో సైతం భారత జవాన్లు సరిహద్దు గస్తీలో ఉన్నారు. అంతలోనే చైనా సైనికులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ భీ కర దాడిలో భారత జవాన్లు 11 మంది దుర్మరణం చెందారు. కొంతమంది చైనా సరిహద్దులో మృతి చెందారు. మృతదేహాలను దేశానికి తీసుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలో భారత ప్ర భుత్వం మృతదేహాలను అక్కడే ఖననం చేయాలని నిర్ణయించింది. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు మంచుకొండల్లోనే ఖననం చేశారు. కుటుంబ సభ్యులు తమ వారిని కడసారి చూపునకు నో చుకోలేదు. అసువులు బాసిన సైనికుల ఆత్మకు శాంతికలగాలని ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నారు. లెహ్ ప్రాంతంలో అమరవీరుల సంస్మరణ స్థూపం కూడా నిర్మించారు. అక్టోబర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఆ ప్రాంతంలో నివాళి కూడా కష్టమే. అందువల్ల ప్రతి ఏడాది సెప్టెంబరులోనే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో ఐపీఎస్ అధికారిని ఎంపిక చేసి ఒక బృందంగా పంజాబ్, చండీఘడ్ మీదుగా లెహ్ ప్రాంతానికి పంపుతారు. అధికారుల బృందం అమరవీరులకు నివాళి అర్పించి తిరిగి వస్తుంది.
అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తాం..
శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ అవుతాం. ఈ నెల 21 నుంచి పది రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ కోసం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం. ప్రజలు, పోలీసులు కుటంబ సభ్యుల్లా కలిసిపోయే పరిస్థితిని కల్పిస్తాం. కమ్యూనిటీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు చేరవై, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాం.
– ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్‌నగర్
త్యాగాలను స్మరించుకుందాం..
ప్రాణత్యాగం చేసిన పోలీసులను హీరోగా ఆరాధిస్తున్నందుకు గర్వపడుతున్నాం. ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాలు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులను చిన్న చూపు చూడొద్దు. అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకుందాం.
– అపూర్వరావు, ఎస్పీ, వనపర్తి
ఫ్లాగ్డేకు ఏర్పాట్లు పూర్తి..
నేటి నుంచి పది రోజులపాటు ఫ్లాగ్‌డే నిర్వహించేందుకు జి ల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూ ర్తి చేశాం. జిల్లాలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షి స్తాం. పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన, షార్ట్ ఫిలీం వం టి పోటీలు నిర్వహించి విజేతల కు బహుమతులు అందజేస్తాం.
– జె.రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. నాగర్‌కర్నూల్ పరిధిలోనే 30 మంది తూటాలకు, ల్యాండ్మైన్లకు బలయ్యారు. 1991లో ఎస్పీ పరదేశినాయుడు సంఘవిద్రోహుల చేతిలో చనిపోవడం సంచలనం సృష్టించింది.