గద్వాల, జూలై 27 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద రోజురోజుకూ పెరుగున్నది. శనివారం ప్రాజెక్టుకు 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండుకుండలా మారి వరద అధికంగా వస్తుండడంతో జూరాలలో 44గేట్లు ఎత్తి 2,91, 384 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్ర స్తుతం 317.490 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.627 టీఎంసీలుగా ఉన్నది. విద్యుదుత్పత్తికి 18,471 క్యూసెక్కులను విడుదల చేస్తుండగా, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 453 క్యూ సెక్కులు, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం 30 గేట్లు ఎత్తి దిగువకు 3,13,619 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.
అయిజ, జూలై 27 : రైతుల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని సింధనూర్ సమీపంలోని ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ నీటితోపాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఎస్ ప్రధానకాల్వలో గంగమ్మకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, మేడికొండ లక్ష్మీకాంతారావు, శ్రీనివాసులు, దొడ్డప్ప, నర్సింహులు, దేవేందర్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల వరద జూరాల నుంచి దిగువకు ప్రవహిస్తున్నది. బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు.
– ఇటిక్యాల, జూలై 27
ఆత్మకూరు, జూలై 27 : ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా అవుట్‌ఫ్లో ఉండడంతో యంత్రాలు వైబ్రేషన్లు వస్తున్నాయని, దీంతో వి ద్యుదుత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ జూరాలలో 5 యూ నిట్‌లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నట్లు ఎస్ఈ సబ్బరామిరెడ్డి తెలిపారు. ఎగువ జూరాలలో శుక్రవారం అర్ధరాత్రి వరకు 2.272 మిలియన్ యూనిట్లు జరుగగా, మొత్తంగా 27.123 మి.యూ ఉత్పత్తి అయ్యింది. దిగువ జూరాలలో 1.975 మి.యూ మాత్రమే ఉత్పత్తి జరుగగా, మొత్తంగా 32.995 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది.
మక్తల్, జూలై 27 : మక్తల్ మండలం సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మక్తల్ మండలం భూత్పూర్ వద్ద నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ కొనసాగుతున్నది. బీమా ఫేజ్-1లోని చిన్న గోప్లాపూర్ వద్ద స్టేజీ-1 పంప్‌హౌస్ నుంచి 1,300 క్యూసెకుల నీటిని కృష్ణానది నుంచి ఎత్తిపోస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్‌కు 500 క్యూసెకులు, మక్తల్ తిరుమలాయ చెరువు కట్ట వద్ద ఉన్న స్టేజ్-2 పంప్‌హౌస్ నుంచి 800క్యూసెకుల వరద నీరు చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అధికారులు పంపింగ్ చేస్తున్నారు. రిజర్వాయర్‌లో 1.92 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు వెల్లడించారు. రైట్, లెఫ్ట్ కెనాల ద్వారా సాగుకు 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.