రైతుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం కల్ప తరువులా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వరకు కర్షకులకు వెన్నంటే నిలిచింది. వారికి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ధాన్యాన్ని కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. తాజాగా మొక్కజొన్నను సైతం కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మూడేండ్లుగా మక్క సాగు పెరుగుతూ రాగా సేకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పీఏసీసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే వారంలో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టి మొత్తం 44 వేల మెట్రిక్ టన్నుల మక్కను సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. క్వింటాకు రూ.1,962 మద్దతు ధర అందించనున్నారు. పంటను బాగా శుభ్రపర్చి 14 శాతం తేమ ఉన్న సమయంలో తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో రైతుల ఇండ్ల ముంగిళ్లలోనే కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు.
– నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/జడ్చర్ల, ఏప్రిల్ 30
నాగర్కర్నూల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మక్కల విక్రయంలో రైతుల కష్టాలు తీర్చేలా కొనుగోళ్లు చేయాలని సీఎం కేసీఆర్ మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు మార్క్ఫెడ్ అధికారులు వచ్చే వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మే మొదటి వారంలో ఊరూరా మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. క్వింటాకు రూ.1,962చొప్పున మద్దతుధరను నిర్ణయించారు. ఇది మక్క రైతులకు ఎంతో ఊరట కల్పించనుంది.
జిల్లాలో మక్క సాగు ఇలా..
నాగర్కర్నూల్ జిల్లాలో ఈ సీజన్లో 11,883మంది రైతులు 20,942ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. దీనివల్ల 60వేల మెట్రిక్ టన్నులకుపైగా పంట కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని బిజినేపల్లిలో అత్యధికంగా 4662 ఎకరాల్లో, తాడూరులో 4012ఎకరాలు, తెలకపల్లిలో 3648ఎకరాల్లో, తిమ్మాజిపేటలో 1589ఎకరాల్లో సాగు చేపట్టారు. అత్యల్పంగా చారకొండలో 4ఎకరాల్లో, పదరలో 7ఎకరాల్లో, పెంట్లవెల్లిలో 24ఎకరాల్లో సాగు చేపట్టడం జరిగింది. సీఎం కేసీఆర్, ప్రభుత్వ సూచనలతో జిల్లాలో ఏటేటా మొక్కజొన్న సాగు పెరుగుతోంది. 2016 లో జిల్లా ఏర్పడ్డాక 845ఎకరాల్లో ఉన్న మొక్కజొన్న సాగు ఇప్పుడు అత్యధికం గా 20వేల ఎకరాలకుపైగా చేరుకోవడం విశేషం. దీనికోసం జిల్లాలోని నాగర్కర్నూల్, తా డూరు, తెలకపల్లి, బిజినేపల్లి, తిమ్మాజిపేట, లింగాల, కొ ల్లాపూర్, కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, బల్మూర్ మండలాల్లోని సింగిల్ విండో కేంద్రాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
10 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. మూడేండ్ల్లలో మొక్కజొన్న సాగు, దిగుబడి పెరుగుతూ వస్తున్నది. జిల్లా ఏర్పడిన ఏడాది 845ఎకరాల్లో సాగవగా 2,535మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2020లో 7,979ఎకరాల్లో, 2021లో 10,811ఎకరాల్లో, ఈసారి 20,930ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ప్రభుత్వం క్వింటాకు రూ.1,962చొప్పున మద్దతుధరను నిర్ణయించింది. జిల్లాలో 10 సింగిల్విండోల ఆధ్వర్యంలో మే మొదటి వారంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తాం.
– నర్సింగరావు, కందనూలు జిల్లా మార్క్ఫెడ్ అధికారి