మహబూబ్‌నగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లా అతలాకుతల మవుతున్నది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా పారుతుండగా.. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ప్రవాహంలో వాహనాలు చిక్కుకుపోయాయి. అయినా కొందరు ప్రమాదభరితంగా వాగులు దాటారు. హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ చెరువుకు గండిపడింది.
సంగంబండ రిజర్వాయర్ 6 గేట్లు తెరవగా.. సరళాసాగర్ 3 వుడ్ సైఫన్లు, 1 ప్రైమరీ సైఫన్ తెరుచుకున్నాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు, దుంధుబీ నదిని జిల్లా కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. పలు చోట్ల పాడుబడిన ఇండ్లు కూలిపడ్డాయి. పాత ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. నారాయణపేటకు వయా భూనీడు మీదుగా వెళ్లే రోడ్డును బంద్ చేశారు.
మక్తల్ మండలం కర్నెకి వెళ్లే దారిలో కల్వర్టుపై పారుతున్న వరదతో రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. రాజోళి మండలంలో పలు మట్టి ఇండ్లు నేలమట్టమయ్యాయి. నాగర్‌కర్నూల్ చెరువు కట్ట మీదుగా ఎండబెట్ల, తాడూరు మండలాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ప్రవాహం దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరగడంతో 10 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. వనపర్తి, కల్వకుర్తి ప్రాంతాల్లో సాగునీటి కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలకు సూచించారు.
అచ్చంపేట రూరల్, ఆగస్టు 18 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్నెవారిపల్లి సమీపంలో పెద్దమ్మ ఆలయం వద్ద జలపాతం వెలుగులోకి వచ్చింది. ఎస్ఎల్బీసీ వెనుక భాగంలో కనువిందు చేసిన జలపాతం గురించి సిద్ధాపూర్ గ్రామ యువకులు పోలీసులకు వివరించగా.. వారు సందర్శించారు. దాదాపు 500 మీటర్లపై నుంచి నల్లమల కొండల మీదుగా పారుతూ.. మరో
100 మీటర్ల దిగువన రెండు పాయలుగా జాలువారుతున్న జలపాతం అందాలు కనువిందు చేశాయి. స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లి వాటర్‌ఫాల్స్ అందాలను తిలకించారు.