వనపర్తి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని నల్లబజారుకు దర్జాగా తరలించిన రైస్‌మిల్లర్ల యజమానులు ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. 2020 నుంచి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలోని మెజార్టీ రైస్‌మిల్లులు సీఎంఆర్ ఇవ్వకుండా ప్రభుత్వానికి లక్షలాది టన్నుల ధాన్యం బకాయిలు పడ్డాయి. 2024-25 సీజన్‌కు సంబంధించి ఒక్క రైస్‌మిల్లు అయినా సీఎంఆర్ కేటాయింపులకు అర్హత పొందుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో రైస్ మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తున్నది. ప్రజల సొమ్ము.. పరులపాలు అన్నట్లు సీఎంఆర్ వ్యవహారం కొలిక్కి రావడంలేదు. నాలుగేండ్లుగా సీఎంఆర్‌ను ఇవ్వకుండా యథేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల ప్రోత్సాహంతో అడ్డదారుల్లో మిల్లులకు కేటాయింపులు చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో లక్షలాది టన్నుల సీఎంఆర్ ధాన్యం పెండింగ్‌లో ఉంటున్నది. వనపర్తి జిల్లాలో 172 రైస్ మిల్లులున్నాయి. వీటిలో సక్రమంగా నడుస్తున్నవి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యంలో మర ఆడించి 67 శాతం బియ్యం ఇవ్వాలి.. కానీ ఈ నిబంధనను మెజార్టీ మిల్లులు పాటించడం లేదన్నది సుస్పష్టంగా అర్థమవుతున్నది.
2023-24లో రెండు సీజన్లకు కలిపి 1.15 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉన్నది. వానకాలంలో 1.91 లక్షల టన్నుల బియ్యాన్ని 82 మిల్లులకు కేటాయిస్తే.., కేవలం 58వేల టన్నులు మాత్రమే వచ్చాయి. ఇం కా 70వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ప్ర భుత్వానికి రావాల్సి ఉన్నది. అలాగే యాసంగికి సం బంధించి 61వేల టన్నుల బియ్యం రావాల్సి ఉండ గా.. 16,000 మెట్రిక్ టన్నులు మాత్రమే చెల్లించా రు. ఇంకా 45వేల టన్నుల బియ్యం బకాయిలున్న వి. ఇలా వానకాలం, యాసంగిలో కలిపి 109 మి ల్లులకు కేటాయింపులు చేశారు. బకాయిలు పడ్డ మి ల్లుల నుంచి వసూలుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా మిల్లర్ల యజమానులు మాత్రం నత్తనడకన కదులుతున్నారు. ఇలా దాదాపు రూ. 540 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లు మింగేశారు.
సీఎంఆర్ బకాయి పడిన మిల్లులకు గడువు తేదీ పొడిగింపు కొనసాగుతుందే తప్పా.. అనుకున్న స్థాయిలో బియ్యం మాత్రం ప్రభుత్వానికి రావడం లేదు. ప్రతినెలా రెండు సమీక్షలు, బకాయిల గడువు ముగిసినప్పుడల్లా పొడిగింపులు షరామామూలుగానే సాగుతున్నాయి. 2023-24 వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలను పూర్తి చేయాలని ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కనీసం ఈ గడువులోపైనా బకాయిలు చెల్లిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.
జిల్లాలో రైస్‌మిల్లుల వ్యవస్థ అస్తవ్యస్థంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ సొమ్మును దర్జాగా పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు సొమ్ము పోగు చేసుకున్నారు. ఇందుకు కొందరు అధికారులు సైతం సహకరించి అవకాశానికి మించి దండుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా నాలుగైదు సీజన్ల నుంచి సీఎంఆర్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లకు తరలించి ఎంచక్కా మిల్లర్లు తమ వ్యాపారాలను చక్కబెట్టుకున్నారు. నిజానికి ఒక్క సీజన్లో సీఎంఆర్ పెండింగ్ పడితే.. ఆ మిల్లుకు మళ్లీ ధాన్యం కేటాయించొద్దు. కానీ, ఈ నిబంధనలను తుంగలో తొ క్కడంతో ఇక్కడ అవినీతికి అంతులేకుండా పోయిం ది. ఇలా జిల్లాలోని మెజార్టీ మిల్లులన్నీ గతంలో తీసుకున్న ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ఇవ్వడంలో బకాయిలుపడ్డారు. మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాది వానకాలం సీజన్ ధాన్యం కూడా చేతికి రానున్నది. సర్కార్ సైతం కొనుగోళ్ల ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లాలోని 172 రైస్ మిల్లులుంటే.. ఎన్నింటికి ప్రభుత్వం ధాన్యాన్ని కేటాయించే అర్హత వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతేడాదికి సంబంధించి 1.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉన్నది. వీటిని పూర్తి చేసేందుకు ఈ నెల చివరి వరకు అవకాశం క ల్పించాం. బకాయిలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పిన మిల్లులకు మాత్రమే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తాం. పెండింగ్లున్న వాటికి కేటాయింపులు లేవు. సీఎంఆర్ వసూళ్లకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తు న్నాం. గడవులోగా బకాయిలు పూర్తి చేస్తే.. అందులో కొన్ని మిల్లులకు కేటాయింపులు వచ్చే అవకాశం ఉన్నది.